Share News

గురజాడ జీవితం భావితరాలకు ఆదర్శం

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:43 AM

మహాకవి గురజాడ అప్పారావు జీవితం భావితరాలకు ఆదర్శమని హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌తో పాటు పలువురు వక్తలు కొనియాడారు.

 గురజాడ జీవితం భావితరాలకు ఆదర్శం
మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌

- ఆయన గృహాన్ని, సంపదను పరిరక్షించాలి

- హైకోర్టు సీనియర్‌ జడ్జి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌

- ఆచార్య ఇనాక్‌కు గురజాడ పురస్కారం ప్రదానం

విజయనగరం రూరల్‌/కల్చరల్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మహాకవి గురజాడ అప్పారావు జీవితం భావితరాలకు ఆదర్శమని హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌తో పాటు పలువురు వక్తలు కొనియాడారు. గురజాడ వర్థంతి సందర్భంగా ఆదివారం నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక పీవీజీ రాజు క్షత్రియ కళ్యాణ మండపంలో గురజాడ విశిష్ట పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి మానవేంద్రనాథ్‌ రాయ్‌ హాజరై మాట్లాడారు. గురజాడ వర్ధంతి సభలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందం ఇచ్చిందన్నారు. గురజాడ గృహాన్ని సందర్శించే భాగ్యం కూడా తనకు దక్కిందన్నారు. గురజాడ వ్యక్తి కాదని, శక్తిగా ఎదిగారని కొనియాడారు. గురజాడ రచనలు, పద్యాలు చదివిన అనుభవంతో తానేంతో చైతన్యవంతం అయ్యానన్నారు. ఇటువంటి మహానీయుల సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన గురజాడ దేశభక్తి గేయాలు, నేటి తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఇటువంటి సభలో పాల్గొనడానికి ఆహ్వానించిన గురజాడ సాంస్కృతిక సమాఖ్య సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త, పద్మ శ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు గురజాడ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డు గ్రహీత ఇనాక్‌ మాట్లాడుతూ.. ఇటువంటి మహనీయుల పేరుతో తనను సత్కరించి, సన్మానించడం మరువలేనిదన్నారు. గురజాడ ఒక వ్యక్తిగా కాకుండా శక్తిగా ఎదిగి యావత్తు జాతిని మేల్కొలిపారన్నారు. ఆయన గృహాన్ని, సంపదను భావితరాలకు అందించే విధంగా పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గురజాడ ఉత్తమ కవితా పురస్కారాలను సిరికి స్వామినాయుడు (పార్వతీపురం), కొత్తూరు సీతారామరాజు ( కాకినాడ), మహ్మాద్‌ ఆఫ్సర్‌ వలీషా (కోనసీమ), సునీత గంగవరపు (పల్నాడు), ఇనపకుర్తి చిన సత్యనారాయణ, చల్లపిల్ల శ్యామల (విజయనగరం)కు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయాధికారి బబిత, కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్‌, రోటరీ మాజీ గవర్నర్‌ ఎం.వెంకటేశ్వరరావు, గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు ఎం.వెంకటేశ్వరరావు, కాపుగంటి ప్రకాష్‌రావు, ఎ.గోపాలరావు, కోలగట్ల తమ్మన్నశెట్టి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గురజాడ గౌరవ యాత్ర

మహాకవి గురజాడ వర్ధంతి సందర్భగా సాహితీస్రవంతి, జన విజ్ఞాన వేదిక సంయుక్త నిర్వహణలో ఆదివారం నగరంలోని గురజాడ గృహం నుంచి జిల్లా పరిషత్‌ వరకూ గౌరవ యాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో పలువురు సాహితీవేత్తలు, రచయితలు, కవులు, నగర ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన గురజాడ రచనలు- ప్రాసంగీకతపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహితీస్రవంతి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తెలకలపల్లి రవి, రచయితలు అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరీనాయుడు, సాహితీస్రవంతి ప్రతినిధులు చీకటి దివాకర్‌, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి ఎంవీఎన్‌ వెంకటరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగిస్తూ.. గురజాడ సమాజంలో వెలుగులను నింపే ఓ శక్తిగా నిలిచారన్నారు. గురజాడ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. గురజాడ దేశభక్తి గేయాన్ని విద్యాలయాల్లో ప్రార్థనాగీతంగా ప్రకటించాలన్నారు. ఆయన పేరుతో విజయనగరంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రొంగలి పోతన్న, మయూరి హోటల్‌ అధినేత బాబురావు, పెద్దింటి అప్పారావు, వీఎస్‌ ప్రసాద్‌, సాహితీవేత్తలు, రచయితలు, సాహితీస్రవంతి, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Updated Date - Dec 01 , 2025 | 12:43 AM