జీఎస్టీ తగ్గింపుతో పారిశ్రామికవేత్తలకు సువర్ణావకాశం
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:58 AM
జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు పారిశ్రామికవేత్తలకు ఇదే మంచి అవకాశమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
మంత్రి శ్రీనివాస్
గజపతినగరం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు పారిశ్రామికవేత్తలకు ఇదే మంచి అవకాశమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. గతంలో ఒక్కో రాష్ట్రంలో ఒక రకంగా జీఎస్టీ ఉండడంతో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చేందుకు సుముఖత చూపేవారు కాదన్నారు. నేడు ప్రధాని నరేంద్రమోదీ ఒకే రాష్ట్రం ఒకే జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడం శుభపరిణామం అన్నారు. జీఎస్టీ వల్ల వచ్చే టాక్స్‌ల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ.2లక్షల కోట్లు ఆదాయం కోల్పోగా మన రాష్ట్రానికి రూ.8వేల కోట్ల ఆదాయం కోల్పోతున్నామని చెప్పారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో సామాన్య ప్రజలకు అతితక్కువ ధరకు అన్నిరకాల వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. అనంతరం ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్ ప్రమీలాగాంధీ, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, మాజీ జడ్పీటీసీ మక్కువ శ్రీదర్, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.