Share News

Green signal for women's power! స్త్రీశక్తికి గ్రీన్‌ సిగ్నల్‌!

ABN , Publish Date - Aug 01 , 2025 | 12:19 AM

Green signal for women's power! ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణ పథకానికి ప్రభుత్వం స్త్రీశక్తి పేరును తాజాగా ఖరారు చేసింది. ఈ నెల 15 నుంచే అమలు చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అధికారులంతా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Green signal for women's power! స్త్రీశక్తికి గ్రీన్‌ సిగ్నల్‌!

స్త్రీశక్తికి గ్రీన్‌ సిగ్నల్‌!

మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం పేరు మార్పు

ఆగస్టు 15 నుంచి ప్రారంభం

ఏర్పాట్లలో అధికారులు

విజయనగరం, జూలై 31 (ఆంధ్రజ్యోతి):

ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణ పథకానికి ప్రభుత్వం స్త్రీశక్తి పేరును తాజాగా ఖరారు చేసింది. ఈ నెల 15 నుంచే అమలు చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అధికారులంతా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు పథకాన్ని పట్టాలెక్కించేందుకు పంద్రాగస్టును ముహూర్తంగా నిర్ణయించారు. ఇప్పటికే కొత్త బస్సుల విషయంపై అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కొత్త బస్సులు వచ్చేవరకూ పాత బస్సులతోనే పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మహిళలకు పెద్దపీట..

మహిళలకు పెద్దపీట వేస్తూ ఎన్నికల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని రూపొందించారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో చేర్చారు. ఇప్పుడు ఆచరణకు దిగుతున్నారు. ప్రభుత్వం పథకానికి స్త్రీశక్తిగా నామకరణం చేసింది. మరోవైపు జీరో ఫెయిర్‌ టిక్కెట్‌ ముద్రణకు సైతం ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. ఆ టిక్కెట్‌పై స్త్రీశక్తి పేరు ఉంటుంది. అదే సమయంలో ఏ డిపోకు చెందిన బస్సు.. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం వంటివి ఉంటాయి. ప్రభుత్వ రాయితీ విషయం అందులో ఉంటుంది. ఉదాహరణకు విజయనగరం నుంచి రాజాం వెళ్లేందుకు రూ.120 టిక్కెట్‌ ధర ఉందనుకుంటే జీరో ఫెయిర్‌గా చూపుతూ ప్రభుత్వ రాయితీ కింద రూ.120లు చూపుతారన్న మాట. తద్వారా ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఎంత భరిస్తున్నదీ మహిళలకు తెలియజేయనుంది. పథకం పేరు విషయంలో పూర్తిగా స్పష్టత వచ్చింది.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో విజయనగరం, పార్వతీపురం, ఎస్‌.కోట, సాలూరు, పాలకొండలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. మొత్తం 450 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. 1.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి. రోజుకు వీటిలో సగటున 95 వేల మందికి పైగా ప్రయాణం చేస్తుంటారు. అందులో మహిళలు 37 వేల మంది దాటే ఉంటారు. అయితే ఉమ్మడి జిల్లాను ప్రామాణికంగా చేసుకొని మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా పల్లెవెలుగు, అల్ర్టాపల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లతో పాటు సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుకానుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సంబంధించి 179 సర్వీసులు నడుస్తున్నాయి. మరో 11 బస్సులు ఇటీవల కొత్తగా వచ్చాయి. మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి మరో 20 వరకూ బస్సులు అవసరం అవుతాయి. ఇంకోవైపు మన్యం జిల్లాలో మరో 40 బస్సుల వరకూ అవసరం అవుతాయని అధికారులు అంచనా వేసి పంపించారు.

ఏర్పాట్లు చేస్తున్నాం

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఈ పథకానికి స్ర్తీశక్తి పేరు పెట్టినట్లు తెలిసింది. ఇంకా అధికారిక ఉత్తర్వులు రాలేదు. ఇప్పటికే డిపోల వారీగా.. రూట్లవారీగా ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. అవసరం అనుకుంటే అదనపు సర్వీసులను సైతం నడుపుతాం. బస్సులను ఫిట్‌గా ఉంచాలని ఉన్నాతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.

- వరలక్ష్మి, ప్రజారవాణా అధికారి, విజయనగరం

------------

Updated Date - Aug 01 , 2025 | 12:19 AM