Employee Transfers ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - May 16 , 2025 | 11:19 PM
Green Signal for Employee Transfers ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిషేధాన్ని సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2 వరకు బదిలీలు, పోస్టింగులకు అవకాశం కల్పించింది. ఐదేళ్లూ ఒకేచోట పనిచేసిన వారు ఈ నెలాఖరుకు తప్పనిసరిగా బదిలీ అవుతారు.
ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారికి మార్పు తప్పనిసరి
ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రాధాన్యం
మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
పార్వతీపురం, మే 16 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిషేధాన్ని సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2 వరకు బదిలీలు, పోస్టింగులకు అవకాశం కల్పించింది. ఐదేళ్లూ ఒకేచోట పనిచేసిన వారు ఈ నెలాఖరుకు తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఐదేళ్లు పూర్తికాని ఉద్యోగులు కూడా అభ్యర్థనపై బదిలీలకు అర్హులు. కొన్ని కేటగిరీలకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఉంటాయని మార్గదర్శకాల్లో ప్రభుత్వం సూచించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు స్థానచలనం నుంచి మినహాయింపు లేదా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మే 31లోపు ఉద్యోగ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఈ సాధారణ బదిలీల నుంచి మినహాయింపు లభిస్తుంది. వారిని విజ్ఞప్తి లేదా పరిపాలనా కారణాలతో స్థానచలనం కల్పించొచ్చు. అంధులైన ఉద్యోగులు, మానసిక దివ్యాంగ పిల్లలున్న కలిగిన ఉద్యోగులకు వారి కోరిక మేరకు బదిలీల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా విధులు నిర్వహిస్తున్న వారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి అభ్యర్థన మేరకు బదిలీలు చేపడతారు. వితంతువులైన ఉద్యోగుల వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. భార్యాభర్తలకు ఒకే చోట లేదా సమీప ప్రాంతాల్లో పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. గత ఏడాది సెప్టంబరు నెలలో బదిలీలు ప్రక్రియ నిర్వహించగా, ఈ సారి పాఠశాలల సెలవులు ముగిసేలోగా ఈ ప్రక్రియ పూర్తి చేసే విధంగా ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. చివరి రోజునే రెవెన్యూ తోపాటు చాలా శాఖల్లో బదిలీలు నిర్వహించడం అనవాయితీగా జరుగుతుంది. ఈ సారి బదిలీలు ముందుగా పూర్తి చేస్తారా? చివరి రోజునే ప్రక్రియ పూర్తి చేస్తారా? అనేది అధికారులకే తెలియాలి.
విద్యాశాఖ మినహా అన్ని శాఖల్లో ...
విద్యా శాఖ మినహా జిల్లాలోని 52 ప్రభుత్వ శాఖల ఉద్యోగలకు ఈ బదిలీలు వర్తించనున్నాయి. రెవెన్యూ, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ శాఖలు, ఖజానా, పంచామతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, హౌసింగ్ , జడ్పీ, ఆర్‌అండ్‌బీ , మున్సిపల్ , పశు సంవర్థక , పరిశ్రమలు, ఇరిగేషన్, వాణిజ్యం తదితర శాఖల్లో అర్హులైన వారు బదిలీలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా సుమారు 13 వేల ఉద్యోగులు ఉన్నారు.
ఐదేళ్లు పూర్తికాని వారే అత్యధికం...
మన్యం జిల్లా ఏర్పడి మూడేళ్లు గడుస్తుండడంతో ఇక్కడ ఐదేళ్లు సర్వీసు పూర్తికాని ఉద్యోగులే అత్యధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అయితే ఇక్కడ పనిచేసే వారికి బదిలీ జరిగే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా విషయానికొస్తే ఇక్కడ బదిలీలు తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కాగా గిరిజన ప్రాంతాల నుంచి బదిలీలు ఎక్కువగా జరగనున్నాయి. రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులు స్థానచలనం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
నేతల వద్దకు అధికారులు
బదిలీలకు ఉత్వర్తులు ఇవ్వడంతో ప్రజా ప్రతినిఽధులు వద్దకు అధికారులు, సిబ్బంది క్యూ కడుతున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ పని చేసేరంతా తమ కావల్సిన స్థానం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల సిఫారసుల కోసం గట్టిగా పైరవీలు సాగిస్తున్నారు. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపఽథ్యంలో తమ కావల్సిన ఉద్యోగులను తెచ్చుకోవాలని కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సారి ఉద్యోగులు బదిలీల్లో నిబంధలను పాటిస్తారా? సిఫారుసులకు పెద్ద పీట వేస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది.