Trustees Committee ధర్మకర్తల మండలి నియామకానికి గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:31 PM
Green Signal for Appointment of Trustees Committee జిల్లాలోని ప్రధాన దేవాలయాల్లో ధర్మకర్తల మండలి నియామకాలకు దేవదాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు మన్యంలో తోటపల్లిలో వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానం, పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం, మక్కువ మండలంలో శంబర పోలమాంబ దేవాలయాల్లో సభ్యుల నియామకాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
గరుగుబిల్లి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రధాన దేవాలయాల్లో ధర్మకర్తల మండలి నియామకాలకు దేవదాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు మన్యంలో తోటపల్లిలో వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానం, పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం, మక్కువ మండలంలో శంబర పోలమాంబ దేవాలయాల్లో సభ్యుల నియామకాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు రోజుల్లో ఆయా ఆలయాలు, పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నోటిఫికేషన్ ప్రతులను ఉంచాలి. దేవాలయాల పరిధిలోని సమాచార సేకరణకు ప్రత్యేకాధికారులను నియమించారు. అర్హులైన వారి దరఖాస్తుల పరిశీలన తర్వాత నియామకం చేపట్టనున్నారు. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియామకమైన ధర్మకర్తల మండలి సభ్యులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలో ఏడాది తర్వాత నియామకాలకు చర్యలు చేపట్టారు. సెక్షన్ 15కు అనుగుణంగా 30/87 యాక్ట్ మేరకు నోటీసులు ప్రచురించిన 20 రోజుల్లోగా సంబంధిత దేవాలయాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. ధార్మిక పరిషత్ నియమ నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల పూర్వాపరాలను నిశితంగా సేకరించి నివేదికలు అందించాలని రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధికారులకు సూచించారు. నేర ప్రవృత్తి ఉన్నట్లయితే ఈ విషయాన్ని కూడా పొందుపర్చాల్సి ఉంది.
6ఏ విభాగంలో మూడు దేవాలయాలు
దేవదాయశాఖ నిబంధనల మేరకు రూ.50 లక్షలు పైబడి ఆదాయం వచ్చే ఆలయాలను 6ఏగా పరిగణిస్తారు. ఈ మేరకు పాలకొండ కోట దుర్గమ్మ దేవాలయానికి సంబంధించి ఏడాదికి రూ. కోటి పైబడి వస్తుంది. శంబర పోలమాంబ ఆలయానికి కూడా రూ. కోటికి పైబడి ఆదాయ వనరులు ఉన్నాయి. తోటపల్లి దేవస్థానానికి కూడా రూ. 50 లక్షలు పైబడి ఆదాయం వస్తుంది. దీంతో జిల్లాలో ఈ మూడు దేవాలయాలను 6ఏలో పొందుపర్చారు. ఈ దేవాలయాలకు ధర్మకర్తల మండలి చైర్మన్‌తో పాటు మరో 8 మంది పాలక మండలి సభ్యులను నియమించనున్నారు. ఇందులో ప్రధాన అర్చకులతో పాటు ఆలయ వ్యవస్థాపకుల్లో ఒకరిని నియమించనున్నారు. శాసనసభ్యులు ఆమోదంతో ఎంపిక చేయనున్నారు. ‘జిల్లాకు సంబంధించి మూడు ప్రధాన ఆలయాల్లో ధర్మకర్తల మండలి నియామకాలపై ఆదేశాలు అందాయి. సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో నోటిఫికేషన్ల ప్రతులను ఉంచుతాం. నిబంధనల మేరకు అర్హుల ఎంపిక జరగనుంది. దరఖాస్తుల స్వీకరణ తర్వాత సంబంధిత వ్యక్తుల సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తాం.’ అని ఈవో వీవీ సూర్యనారాయణ తెలిపారు.