ఉపాధ్యాయ వృత్తిలో గొప్ప సంతృప్తి
ABN , Publish Date - Sep 05 , 2025 | 11:13 PM
ఉపాధ్యాయ వృత్తిలో గొప్ప సంతృప్తి ఉంటుందని గిరిజన సంక్షేమ శాఖా మం త్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
- మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
- ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
పార్వతీపురం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ వృత్తిలో గొప్ప సంతృప్తి ఉంటుందని గిరిజన సంక్షేమ శాఖా మం త్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. జిల్లా కేంద్రం పార్వతీపురం లయన్స్ క్లబ్‌లో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రితో పాటు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే బోనెల విజయంద్ర, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి సంధ్యారాణి.. చిన్నారుల భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు సమాజంలో ఎంతో గౌరవం ఉందన్నారు. గురువులు చూపిన మార్గంలో విద్యార్థులు నడుస్తారని అన్నారు. ‘నేను, ప్రభుత్వ విప్ జగదీశ్వరి, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఒకప్పుడు ఉపాధ్యాయులమే. పిల్లలకు పాఠాలు బోధిస్తూ వారిని కనుసైగలతో క్రమశిక్షణలో ఉంచగలిగిదే ఒక్క గురువులే. పార్వతీపురానికి ప్రభుత్వం వైద్య కళాశాలను మంజూరు చేసింది. దీనివల్ల త్వరలోనే ఏఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సులకు ప్రత్యేక కళాశాలలు వస్తాయి. ఇంజనీరింగ్ కళాశాల పనులను త్వరలోనే పూర్తిచేస్తాం. పదో తరగతి ఫలితాల్లో మూడు పర్యాయాలు రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానం సాధించిందంటే అది ఉపాధ్యాయులు కృషి వల్లనే సాధ్యమైంది. మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకొని వార్తలు ప్రచురించాలి. లేకపోతే ఎంతోమంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. మెగా డీఎస్సీ ద్వారా కొత్త ఉపాధ్యాయులు వస్తున్నారు. పిల్లలకు పాఠాలతో పాటు విలువలు నేర్పించాలి. రక్త సంబంధాలు, అనురాగాలు వివరించాలి.’ అని మంత్రి ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ జగదీశ్వరి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఒక స్థాయిలో ఉన్నారంటే దానికి ఉపాధ్యాయులే కారణమన్నారు. ప్రస్తుతం క్రమశిక్షణతో కూడిన విద్యను బోధిస్తున్నారన్నారు. విద్యార్థులకు మంచి అలవాట్లు నేర్పించాలని అన్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ.. గతంలో ఉపాధ్యాయులకు ఎటువంటి గౌరవం ఉందో, ప్రస్తుతం ఎటువంటి గౌరవం ప్రభుత్వం అందిస్తుందో వారు తెలుసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ గురించి గొప్పగా చెప్పుకొనే విధంగా విద్యా వ్యవస్థలో తమ ప్రభుత్వం మార్పులు తీసుకొస్తున్నట్టు తెలిపారు. కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతం మారుమూల ప్రాంతం అయినప్పటికీ మట్టిలో మాణిక్యాలు తీసే విధంగా పదో తరగతి పరీక్షల్లో జిల్లా మూడు పర్యాయాలు రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించే విధంగా ఉపాధ్యాయులు చేసిన కృషి మరువలేనిదన్నారు. జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలో విద్యార్థులకు అందిస్తున్న విద్యా ప్రమాణాలు, బోధనలు, మౌలిక వసతుల కల్పనలో జిల్లా పదో స్థానంలో ఉందన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు అవకాశం ఉన్నవారు దత్తత తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రూపొందించిన బాల వెలుగు మాసపత్రికను మంత్రి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, కలెక్టర్ ఆవిష్కరించారు. ఉత్తమ ఉపాధ్యాయులకు జ్ఞాపికను అందించి దుశ్శాలవలతో సత్కరించారు. వివిధ పాఠశాలలు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, సర్వశిక్షా అభియాన్ ఏపీసీటీ తేజేశ్వరరావు పాల్గొన్నారు.