Share News

Gravel Racket గ్రావెల్‌ దందా.. అడ్డుకునేదుందా?

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:41 PM

Gravel Racket — Is Anyone Stopping It? జిల్లాలో గ్రావెల్‌, కంకర తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. రేయింబవళ్లు యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నా.. అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. జిల్లా వ్యాప్తంగా పోడు, డీపట్టా, కొండపోడు, కొండపోరంబోకు భూములతో పాటు అటవీశాఖ పరిధిలో కొండలకు కొదవలేదు. అయితే అక్రమార్కులు వాటిని అడ్డాగా చేసుకుని తవ్వకాలు చేపడుతున్నారు.

Gravel Racket  గ్రావెల్‌ దందా.. అడ్డుకునేదుందా?
తవ్వకాలతో రూపుకోల్పోయిన అట్టలి కొండ

  • యథేచ్ఛగా తవ్వకాలు.. ఆపై తరలింపు

  • చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

పాలకొండ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రావెల్‌, కంకర తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. రేయింబవళ్లు యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నా.. అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. జిల్లా వ్యాప్తంగా పోడు, డీపట్టా, కొండపోడు, కొండపోరంబోకు భూములతో పాటు అటవీశాఖ పరిధిలో కొండలకు కొదవలేదు. అయితే అక్రమార్కులు వాటిని అడ్డాగా చేసుకుని తవ్వకాలు చేపడుతున్నారు. ప్రధానంగా పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని, కురుపాం, సాలూరు, జియ్యమ్మవలస, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల్లో జోరుగా ఈ దందా కొనసాగిస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లతో అక్రమంగా ఇతర ప్రాంతాలకు గ్రావెల్‌ను తరలిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాలకొండ మండలంలోని అట్టలి సమీపంలో ఉన్న కొండ వద్ద కొన్నేళ్లుగా అక్రమార్కులు గుట్టుగా యంత్రాలతో తవ్వకాలు జరిపి విలువైన సహజ సంపదను దోచుకుంటున్నారు. మరికొద్దిరోజుల్లో ఈ గ్రావెల్‌ కొండ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

అనుమతులు నిల్‌...

ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే అక్రమార్కులు జిల్లా వ్యాప్తంగా గ్రావెల్‌ తవ్వకాలు చేపడుతున్నారు. రోజూ వందలాదిగా ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా గ్రావెల్‌ను ఇతర రాష్ర్టాలు, జిల్లా లకు తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటే గనులశాఖాధికారులు ప్రభుత్వ భూముల్లో ఉన్న గ్రావెల్‌కు అధికారికంగా బహిరంగ వేలం వేసి.. తవ్వకాలకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరే అవకాశం ఉంది. కానీ వారు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అక్రమార్కులు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు గ్రావెల్‌ను విక్రయిస్తున్నారు. ట్రాక్టర్‌ లోడ్‌ రూ.1500 నుంచి రూ. 2వేలు వరకు వసూలు చేస్తున్నారు. టిప్పర్‌ లోడ్‌కైతే రూ.4 వేలు నుంచి రూ.8వేల వరకు వసూలు చేస్తున్నారు. మొత్తంగా ఉచి తంగానే గ్రావెల్‌ దోపిడీ చేసి.. బహిరంగ మార్కెట్లో వాటిని విక్రయించి లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నారు. దీనిపై గనుల శాఖ ఏడీ శ్రీనివాసరావును వివరణ కోరగా.. ‘ రెవెన్యూ, గనుల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా పెడతాం. జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు చేపడితే విజిలెన్స్‌ దాడులు చేపడతాం. ’ అని తెలిపారు.

Updated Date - Dec 19 , 2025 | 11:41 PM