Granted 4967... Completed 2399 మంజూరు 4967... పూర్తి 2399
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:51 PM
Granted 4967... Completed 2399 జిల్లాలో పల్లెపండగ పనులు ప్రహసనంగా మారాయి. రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.600.22 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన 4967 పనుల్లో ఇప్పటివరకు రూ.126.34 కోట్ల విలువైన 2399 పనులు మాత్రమే పూర్తయ్యాయి. వాటిలో కేవలం రూ.42 కోట్ల మేర మాత్రమే బిల్లులు చెల్లింపులు జరగ్గా ఇంకా సుమారు రూ.84 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మంజూరు 4967...
పూర్తి 2399
ప్రహసనంగా పల్లెపండగ పనులు
అంచనా వ్యయం రూ.600 కోట్లు
ఇప్పటివరకు అయినవాటి విలువ రూ.126 కోట్లు
పర్సంటేజీలిస్తేనే ఎంబుక్కు నమోదు
మెంటాడ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో పల్లెపండగ పనులు ప్రహసనంగా మారాయి. రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.600.22 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన 4967 పనుల్లో ఇప్పటివరకు రూ.126.34 కోట్ల విలువైన 2399 పనులు మాత్రమే పూర్తయ్యాయి. వాటిలో కేవలం రూ.42 కోట్ల మేర మాత్రమే బిల్లులు చెల్లింపులు జరగ్గా ఇంకా సుమారు రూ.84 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ ప్రభావం వివిధ దశల్లో ఉన్న పనులతోపాటు ఇంకా ప్రారంభంకాని పనులపై పడుతోంది. బిల్లుల చెల్లింపు జరగక ఇదివరకే ప్రారంభమైన పనులు పూర్తిచేయడానికి కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తున్నారు. దీంతో అవి గ్రామాల్లో అసంపూర్తిగా వెక్కిరిస్తున్నాయి.
పంచాయతీరాజ్ శాఖను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పల్లెపండగ పేరుతో గతేడాది అక్టోబరులో 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజున గ్రామసభలు నిర్వహించి గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో జిల్లాలో మొత్తం రూ.438.22 కోట్ల అంచనాతో 4346 అభివృద్ధి పనులకు గ్రామసభలు ఆమోదించాయి. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.162 కోట్ల విలువైన 621 పనులు ఆమోదం పొందాయి. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో గ్రామసభల్లో ఆమోదం పొందిన మొత్తం పనులు 4967 కాగా వీటి మొత్తం అంచనా వ్యయం రూ.600.22 కోట్లు. మంజూరైన పనుల్లో సీసీ రోడ్లు,సీసీ డ్రయిన్లు,బీటీ రోడ్లు,మెటల్ రోడ్లు ఉన్నాయి.
రూ.84.34 కోట్ల బిల్లులు పెండింగ్
రెండు ఆర్థిక సంవత్సరాల్లో పూర్తయినట్టుగా అధికారులు చెబుతున్న మొత్తం 2399 పనులకుగాను రూ.126.34 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈఏడాది జూన్‌లో రూ.42 కోట్లు మాత్రమే చెల్లింపులు జరగ్గా ఇంకా రూ.84.34 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి.
ప్రారంభానికి నోచని 1579 పనులు
రెండు ఆర్థిక సంవత్సరాల్లో మంజూరైన మొత్తం 4967 పనుల్లో....పూర్తయినట్టుగా అధికారులు చెబుతున్న 2399 పనులు, వివిధ ధశల్లో ఉన్నాయని చెబుతున్న 989 పనులు కలిపి మొత్తం 3388 పనులు పోగా మిగిలిన 1579 పనులు ఇప్పటికీ ప్రారంభంకానట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.
ఎంబుక్ నమోదుకు జంకు
వివిధ దశల్లో ఉన్న 989 పనుల్లో కొన్ని ఇటీవల పూర్తయినట్టు, అసలు ప్రారంభమే కాలేదని అంటున్న 1579 పనుల్లో కొన్ని ఈమధ్య మొదలైనట్టు సమాచారం. అయితే వీటికి ఎం బుక్ నమోదుకు అధికారులు జంకుతున్నట్టు తెలుస్తోంది. ఎంబుక్ ప్రక్రియ పూర్తయితే కాంట్రాక్టర్ల నుంచి బిల్లులకు ఒత్తిడి పెరుగుతుందని వెనుకంజ వేస్తున్నట్టు భోగట్టా. పల్లెపండగ పనులకు పర్సంటేజీల బెడద భరించలేకున్నామని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఉన్నతాధికారుల పేరుచెప్పి 7 నుంచి పది శాతంవరకూ డిమాండ్ చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు.
ఎక్కడివక్కడే
బిల్లులు అందక జిల్లాలో అనేకచోట్ల పనులను అర్ధాంతరంగా నిలిపేశారు. దీంతో ప్రజల అసౌకర్యానికి గురవుతున్నారు. పనులు పూర్తికి ప్రభుత్వం, ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. బిల్లుల చెల్లింపులపై గంపెడాశతో ఉన్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
--------------