Share News

ప్రభుత్వ కార్యాలయాలకు సొంత గూడు కరువు

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:55 PM

జిల్లా ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా చాలా ప్రభుత్వ కార్యాలయాలకు ఇంకా సొంత గూడు లేదు.

ప్రభుత్వ కార్యాలయాలకు సొంత గూడు కరువు
కలెక్టరేట్‌ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి (ఫైల్‌)

- అద్దె భవనాల్లోనే కార్యకలాపాలు

- కనీస సదుపాయాలు కరువు

- స్థల పరిశీలనకే పరిమితమైన కలెక్టర్‌రేట్‌ నిర్మాణం

పార్వతీపురం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా చాలా ప్రభుత్వ కార్యాలయాలకు ఇంకా సొంత గూడు లేదు. అద్దె భవనాల్లోనే వాటిని నిర్వహించాల్సి వస్తోంది. నేటికీ నూతన కలెక్టరేట్‌ నిర్మాణానికి నోచుకోలేదు. కేవలం స్థల పరిశీలన చేసి వదిలేశారే తప్ప పనులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో గతంలో ఐటీడీఏ కోసం నిర్మించిన భవనంలోనే కలెక్టరేట్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులోనే కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్వో తదితర కార్యాలయాలు ఉన్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న ఓ ప్రైవేటు భవన సముదాయంలో సుమారు 30 ప్రభుత్వ కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమశాఖ, జిల్లా రిజిస్ట్రేషన్‌, తదితర ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ భవనాల్లో కనీస మౌలిక సౌకర్యాలు కరువయ్యాయి. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు లేకపోవడంతో సంబంధిత అధికారులు, సిబ్బందితో పాటు పనుల కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కలెక్టరేట్‌ నిర్మాణమెప్పుడో?

పార్వతీపురం మండలం అడ్డాపుశీల వద్ద కలెక్టరేట్‌ నిర్మాణం కోసం 60 ఎకరాలను గతంలో కేటాయించారు. పక్కా భవనాలతో నూతన కార్యాలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. అయితే, గత మూడేళ్లుగా అధికారులు రావడం, ఈ స్థలాన్ని పరిశీలించి వెళ్లిపోవడమే తప్ప కలెక్టరేట్‌ నిర్మాణానికి శంకుస్థాపన మాత్రం చేయడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో గానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో గానీ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా కలెక్టరేట్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Oct 14 , 2025 | 11:55 PM