Government Initiative... సర్కారు చొరవ.. ఈడేరనున్న కల
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:20 PM
Government Initiative... A Dream Taking Shape in Eduru గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగా కురుపాంలో మధ్యలో నిలిచిన గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి మోక్షం లభించనుంది. త్వరలోనే పనులు పునఃప్రారంభం కానున్నాయి.
పనుల పూర్తికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలు
గత ప్రభుత్వ తీరుతో నిలిచిన నిర్మాణం
తాజాగా ముఖ్యమంత్రి చొరవతో కదలిక
పార్వతీపురం, జూలై 19(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగా కురుపాంలో మధ్యలో నిలిచిన గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి మోక్షం లభించనుంది. త్వరలోనే పనులు పునఃప్రారంభం కానున్నాయి. ఇటీవల ఈ కళాశాల అంశాన్ని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని వారు ఆదేశించారు. దీంతో గిరిజన విద్యార్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కళాశాల పనులు పూర్తయితే వారికి స్థానికంగానే ఇంజనీరింగ్ విద్య అందుబాటులోకి వస్తోంది.
గత వైసీపీ పాలనలో..
గత వైసీపీ ప్రభుత్వం కురుపాంలో సుమారు రూ.150 కోట్లతో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2021లో పనులు ప్రారంభించారు. అయితే ఆ తర్వాత సకాలంలో బిల్లులు చెల్లించలేదు. గత ప్రభుత్వ పాలనలో మొదట్లో రూ.నాలుగు కోట్ల 53 లక్షల వరకు బిల్లులు చెల్లించారు. అనంతరం రూ.15 కోట్లకు బిల్లులు అప్‌లోడ్ చేసినప్పటికీ చెల్లింపులు జరగలేదు. ఆ తర్వాత కూడా బిల్లులు అప్‌లోడ్ చేసినా నిధులు మంజూరు కాలేదు. మొత్తంగా అప్పట్లో చేసిన పనులకు సుమారు రూ.16.50 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. పనులను మధ్యలోనే నిలిపివేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి...
కురుపాంలో మధ్యలో నిలిచిన గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత వైసీపీ సర్కారు కాలంలో చేపట్టిన పనులకు సంబంధించి మొదటి విడతగా సుమారు రూ.7కోట్ల పైబడి బిల్లులు చెల్లించింది. మరో రూ.9 కోట్ల బిల్లుల చెల్లింపునకు రంగం సిద్ధం చేస్తోంది. ఏదేమైనా సీఎం ఆదేశాలతో కొద్దిరోజుల్లో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పనులు తిరిగి ప్రారంభం కానునుండడంతో ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా కొంతమంది, పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా గిరిజన విద్యార్థులకు ఇక్కట్లు తప్పుతాయి. స్థానికంగా ఇంజనీరింగ్ విద్య చదువుకునే అవకాశం దొరుకుతుందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. ‘ కూటమి ప్రభుత్వం సుమారు రూ. ఏడు కోట్ల వరకు బిల్లులు చెల్లించింది. మిగిలిన బిల్లులు చెల్లించాల్సి ఉంది. రూ. కోటి 50 లక్షల పనులకు సంబంధించి బిల్లులు అప్‌లోడ్ చేయాలి. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి.’ అని ఏపీఐడబ్ల్యూసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ తెలిపారు.
భవనాల పరిశీలన
పార్వతీపురం/కురుపాం: కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాలను ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేట్ చైర్మన్ ఎస్.రాజశేఖర్ శనివారం పరిశీలించారు. పనులు ఎప్పుడు ప్రారంభించారు? ఎందుకు నిలిపివేశారు! తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. 2021లో పనులు ప్రారంభించామని, అప్పట్లో సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణం నిలిచిపోయినట్లు కాంట్రాక్టర్లు తెలిపారు. కాగా మిగిలిన పనుల పూర్తికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, చైర్మన్ వివరించారు.