Scan and Complain! సమస్య ఉందా..స్కాన్ చేసి ఫిర్యాదు చెయ్!
ABN , Publish Date - Jul 05 , 2025 | 10:47 PM
Got a Problem? Scan and Complain! గత నెల నుంచి రేషన్ దుకాణాల నుంచి కార్డుదారులకు నిత్యావసరాల సరుకులు సరఫరా చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్రతి రేషన్‌షాపు వద్ద ప్రత్యేక క్యూ ఆర్ కోడ్‌తో కూడిన పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా సరుకుల పంపిణీపై ఏమైనా అభ్యంతరాలుంటే వెంటనే ఫిర్యాదు చేయొచ్చు.

పారదర్శకంగా సరుకుల సరఫరాకు ప్రభుత్వం చర్యలు
పాలకొండ, జూలై5 (ఆంధ్రజ్యోతి): ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరుకుల సరఫరాను మరింత పారదర్శకంగా చేపట్టేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తోంది. గత వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన ఎండీయూ వాహనాల వ్యవస్థను రద్దు చేస్తూ.. మళ్లీ డిపోల ద్వారా రేషన్ అందజే యాలని ప్రభుత్వ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత నెల నుంచి రేషన్ దుకాణాల నుంచి కార్డుదారులకు నిత్యావసరాల సరుకులు సరఫరా చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్రతి రేషన్‌షాపు వద్ద ప్రత్యేక క్యూ ఆర్ కోడ్‌తో కూడిన పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా సరుకుల పంపిణీపై ఏమైనా అభ్యంతరాలుంటే వెంటనే ఫిర్యాదు చేయొచ్చు. అధికారులు, కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా షాపు వద్ద ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి క్షణాల్లోనే ఫిర్యాదు చేసుకొనేలా ప్రభుత్వం క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది.
జిల్లాలో 578 రేషన్‌షాపులు...
జిల్లాలోని 15 మండలాల్లో 578 రేషన్‌షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో 2,20,934 రైస్‌కార్డులు, 55,939 ఏఏవై కార్డులు ఉన్నాయి. వారందరికీ ప్రతి నెలా ఆయా రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. అయితే రేషన్ పంపిణీలో డీలర్లు అవకతవకలకు పాల్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కార్డుదారులు వారి అభిప్రాయాలు, సమస్యలను తెలియజేయొచ్చు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు ఆదేశాల మేరకు డీలర్లు జిల్లాలోని అన్ని రేషన్‌షాపుల్లోనూ క్యూఆర్ కోడ్ స్కానర్ పోస్టర్లను అందుబాటులో ఉంచారు.
క్యూఆర్ కోడ్‌తో ఉపయోగాలివీ...
రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ప్రత్యేక క్యూ ఆర్ కోడ్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రేషన్ డిపో వద్ద ఉన్న క్యూఆర్‌కు స్కాన్ చేయగానే ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా.. సరుకుల నాణ్యతమై సంతృప్తిగా ఉన్నారా.. రేషన్ డీలరు సరైన తూకంలో సరుకులు ఇచ్చారా..?.. అధిక ధరలు వసూలు చేశారా..? డీలర్ మీతో మర్యాదపూర్వకంగా వ్యవహరించారా, సరుకుల పంపిణీ సమయపాలన పాటిస్తున్నారా..? అనే ప్రశ్నలతో వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులోని ప్రశ్నలకు అవునా, లేదా అనే సమాధానం ఇస్తే చాలు. కార్డుదారుల ఫిర్యాదులు, అభిప్రాయాలు నేరుగా సంబంధిత ఉన్నతాధికారులకు చేరుతాయి. తద్వారా వారు ఆ ఫిర్యాదులను పరిష్కరించనున్నారు.
అక్రమాల నివారణకే ...
రేషన్ డిపోల ద్వారా అందిస్తున్న నిత్యావసర సరుకుల్లో అక్రమాల నివారణకు క్యూఆర్ కోడ్ స్కానర్ ఉపకరిస్తుంది. సరుకుల పంపిణీలో డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తే ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా లబ్ధిదారులు నేరుగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి రేషన్ డిపో వద్ద విధిగా వాటి ఫ్లెక్సీలను అందుబాటులో ఉంచాం.
- మారుతీ, సీఎస్‌డీటీ, పాలకొండ