Projects సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:12 AM
Golden Phase for Irrigation Projects జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పూర్వోదయ’ పథకంలో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన నిధులను.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లాలో కీలకమైన ప్రాజెక్టులకు మళ్లించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది.
తోటపల్లికి రూ.263.36 కోట్లు మంజూరు
పార్వతీపురం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పూర్వోదయ’ పథకంలో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన నిధులను.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లాలో కీలకమైన ప్రాజెక్టులకు మళ్లించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నిధులు కేటాయిస్తూ అంచనాలు రూపొందించారు. అవి మంజూరై పనులు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం కానుంది. లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగడంతో పాటు, కొత్తగా వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది.
నిధుల కేటాయింపు ఇలా..
‘పూర్వోదయ’ పథకంలో భాగంగా జిల్లాలోని తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టుకు రూ.263.36 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో కొత్త ఆయకట్టు పరిధిలో 47,188 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన పనులు చేపట్టనున్నారు. జంఝావతి ప్రాజెక్టుకు రూ.59 కోట్లు కేటాయించారు. పెండింగ్ పనులను పూర్తి చేసి అదనంగా 4013 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
తోటపల్లి పరిస్థితి ఇదీ..
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు ద్వారా పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 333 గ్రామాల పరిధిలో 1,31,221 ఎకరాలకు సాగునీరు అందించాలని అప్పటి ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు 2003, జూన్ 11న శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రభుత్వాలు మారడంలో పనులు సాగలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు ప్రాజెక్టు పనులు పూర్తి చేసి.. 2015 సెప్టెంబరు 10న జాతికి అంకితం చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తోటపల్లి ఆధునికీకరణ పనులపై దృష్టి సారించలేదు. ప్రాజెక్టు నిర్వహణను సైతం గాలికొదిలేసింది. దీంతో ఆయకట్టు రైతులకు ఇబ్బందులు తప్పలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొత్త ఆయకట్టు పరిధిలో 84,035 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని.. 72,855 ఎకరాలకు సాగునీరు అందించారు. ఆ తర్వాత వైసీపీ సర్కారు ఒక ఎకరాకు కూడా అదనంగా నీరందించకలేకపోయింది. ప్రస్తుతం పూర్వోదయ నిధులతో పనులు పూర్తయితే మరో 47,188 ఎకరాలకు సాగునీరు అందనుంది. కాగా ఈ ప్రాజెక్టుకు పరిధిలో ఫెట్ మెయిన్ కెనాల్‌పైన 10 స్ట్రక్చర్లను నిర్మించాల్సి ఉంది. డిస్ర్టిబ్యూటర్స్ పరిధిలో 30 కిలోమీటర్ల మేర ఎర్త్‌వర్క్ , 384 స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉంది. నదికి ఇరువైపులా గ్యాచైన్స్, స్పీల్‌వే వద్ద స్టాప్ లాగ్ గేట్స్ , ఎలక్ర్టికల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి. మెయిన్ కెనాల్‌పైన 80 స్ట్రక్చర్లకు ప్రొటెక్షన్ వర్క్స్ చేపట్టాలి. ఫ్లడ్ ఫోర్ క్యాషంగ్‌తో పాటు సైరన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి 32 మంది లస్కర్లు అవసరం. 119.62 కిలోమీటర్లకు గాను 89.02 కిలోమీటర్ల మేర మాత్రమే ఎర్త్ వర్క్ జరిగింది. 136 స్ట్రక్చర్స్ మాత్రమే పూర్తయ్యాయి.
జంఝావతి ఇలా..
జంఝావతి ప్రాజెక్టు రివర్ గ్యాప్ పూర్తి చేసేందుకు ఒడిశా ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం. కానీ ఆ రాష్ట్రం నుంచి ఎటువంటి సహకారం అందించడం లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా 24,640 ఎకరాలకు సాగునీరు అందించాల్సినప్పటికీ కేవలం 9వేల ఎకరాలకే నీరు అందుతుంది. ఒడిశా రాష్ట్రంలో ఉన్న 11 గ్రామాల్లో 1175 ఎకరాల వరకు భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియకు ఒడిశా ప్రభుత్వం కొన్ని దశాబ్దాలుగా ఏపీకి సహకరించడం లేదు. దీంతో హైలెవెల్ కెనాల్ పరిధిలో పనులు పూర్తవడం లేదు. ఈ నిర్మాణం పూర్తయితే అదనంగా 11,627 ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రాథమిక అంచనా. ఇంజనీరింగ్ అధికారుల లెక్కల ప్రకారం.. ప్రస్తుతం హైలెవెల్ కెనాల్ ద్వారా 8220 ఎకరాలకు నీరందుతుండగా.. లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే.. మరో 780 ఎకరాలకు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో హెడ్ వర్క్స్ రివిట్మెంట్ పనులు సుమారు 99 శాతం పూర్తి చేశారు. మిగిలిన ఒక శాతం పనికి అప్పట్లో రూ. 30 లక్షలు చెల్లించలేదు. ఇప్పుడీ పనులు చేపట్టాలంటే సుమారు రెండు కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.59 కోట్లతో పనులు పూర్తిచేస్తే.. సుమారు 11,627 ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో రైతుల ఇక్కట్లు తీరనున్నాయి.