కూలి పనికి వెళ్లి..
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:57 PM
Go to work.. after got very sad వారు రోజువారీ పనిచేసుకునే కూలీలు.. పొట్టకూటి కోసం పనికి వెళ్తేగాని పూట గడవని పరిస్థితి. తోటివారితో కలిసి ఆదివారం గ్రామంలోని మట్టి గోడలు తవ్వేందుకు వెళ్లారు.

కూలి పనికి వెళ్లి..
రామవరంలో మట్టి గోడ కూలి ఇద్దరు కూలీల మృతి
గంట్యాడ, జూన్ 15(ఆంధ్రజ్యోతి): వారు రోజువారీ పనిచేసుకునే కూలీలు.. పొట్టకూటి కోసం పనికి వెళ్తేగాని పూట గడవని పరిస్థితి. తోటివారితో కలిసి ఆదివారం గ్రామంలోని మట్టి గోడలు తవ్వేందుకు వెళ్లారు. తవ్విన మట్టి తీస్తుండగా ఉన్నఫలంగా గోడ కూలిపోయింది. అమాంతం ఇద్దరిపై పడడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రామవరం గ్రామానికి చెందిన ఎర్ర చిన్నయ్య(61), కొలుసు పైడితల్లి (49) విషాదాంతమిది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రామవరం గ్రామంలోని రీసు సూరిబాబు తన పాడుబడిన ఇంటి మట్టిగోడలను తొలగించడానికి నిర్ణయించుకుని ఇందుకోసం ఎర్ర చిన్నయ్య, కొలుసు పైడితల్లి, బి.ఆద్వాన్నం, ఎల్.పైడిరాజులను పనికి పెట్టుకున్నాడు. శనివారం నుంచి గోడ తొలగిస్తున్నారు. సాయంత్రం వరకూ పనిచేసి కొంత మట్టిని తరలించగా మిగిలినది ఆదివారం ఉదయం తీస్తున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోయింది. పక్కనే ఉన్న ఎర్ర చిన్నయ్య, కొలుసు పైడితల్లిపై పడింది. భారీ మట్టిపెళ్లలు కావడంతో ఇద్దరూ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కురిసిన వర్షానికి గోడ పూర్తిగా నానిపోయి ఉంది. ఈ కారణంగానే కూలిపోయి ఉండొచ్చునని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. చిన్నయ్యకు భార్య సత్యవతి, వివాహమైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పైడితల్లికి భార్య లక్ష్మి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహం కావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఎస్‌ఐ సాయి కృష్ణ, రెవెన్యూ ఇన్‌స్పెక్టరు ప్రసాద్, ఆర్‌ఐ అబద్దం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయికృష్ణ తెలిపారు.