Share News

go to crap field పొలంబాట

ABN , Publish Date - Jun 04 , 2025 | 11:57 PM

go to crap field జిల్లాలో ఖరీఫ్‌ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది రుతుపవనాల ప్రభావంతో తొలకరి జల్లులు ముందే పలకరించడంతో రైతులంతా పొలంబాట పట్టారు. వరి ఆకుమడులు తయారుచేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

go to crap field పొలంబాట

పొలంబాట

జిల్లాలో ఖరీఫ్‌ పనులు ప్రారంభం

వరి నారుమళ్లు సిద్ధం చేస్తున్న రైతులు

అందుబాటులో విత్తనాలు, ఎరువులు

రాజాం, జూన్‌4 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఖరీఫ్‌ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది రుతుపవనాల ప్రభావంతో తొలకరి జల్లులు ముందే పలకరించడంతో రైతులంతా పొలంబాట పట్టారు. వరి ఆకుమడులు తయారుచేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇటు వ్యవసాయ శాఖ కూడా ముందే మేల్కొంది. విత్తనాలు సిద్ధం చేసింది. జిల్లాలో లక్ష హెక్టార్లల్లో వరి సాగుచేస్తారని అంచనా వేసింది. 50 వేల క్వింటాళ్ల వరకు విత్తనాలు అవసరమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఇప్పటికే 15,952 క్వింటాళ్లు రైతుసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది. క్వింటాపై రూ.300 రాయితీ పోగా రూ.1000కి అందిస్తారు. ఎకరానికి 20 కిలోల చొప్పున గరిష్ఠంగా రైతుకు క్వింటా మాత్రమే అందిస్తారు. అయితే సాధారణంగా వరి నారుమడులు 20 నుంచి 30 రోజుల వరకూ అందుబాటులోకి వస్తాయి. ఈ లెక్కన జూలై మొదటి వారంలో వరి ఉడుపులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ప్రధానంగా 1121 రకం విత్తనాలు ఎక్కువగా వినియోగిస్తారు. 135 నుంచి 140 రోజుల్లో పంట అందుబాటులోకి వస్తుంది.

అంతటా జలకళ..

రుతుపవనాల ప్రభావంతో కురిసిన వర్షాలకు చెరువులు, కాలువల్లో నీరు చేరుతోంది. జలకళ సంతరించుకుంది. ఇప్పటికే రైతులు వేసవి దుక్కులు చేసుకున్నారు. ఇప్పుడు వరి నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. జలాశయాలు, కాలువల పరిధిలో ఉన్నవారు వరి నారుమళ్లు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాజాం నియోజకవర్గానికి సంబంధించి మడ్డువలస, నారాయణపురం ఆనకట్ట, తోటపల్లి కాలువ పరిధిలో వరి నారుమళ్లు సిద్ధమవుతున్నాయి. సాధారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెద సాగు కూడా అధికమే. వేసవిలో దుక్కులు పూర్తిచేసుకుని నేరుగా పొలాల్లోనే విత్తనాలు వేస్తారు. అయితే ఈ విధానంలో కలుపుతో పాటు తెగుళ్లు బెడద అధికంగా ఉంటోంది. జిల్లాలో 5 వేల హెక్టార్లలో మాత్రం వెద పద్ధతిలో సాగుచేస్తున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

అపరాల విత్తనాలు సైతం

జిల్లాలో మెట్ట ప్రాంతం అధికం. ఖరీఫ్‌లో మెట్ట ప్రాంతాల్లో వేరుశనగ, మినుము, పెసర, రాగులు, కందులు, నువ్వులు వంటివి సాగుచేస్తారు. సాగునీరు అందుబాటులో లేని ప్రాంతాల్లో వీటి సాగుకు ప్రాధాన్యం ఇస్తారు. ఒక వైపు వరి పండిస్తూనే అపరాలు పండిస్తున్న రైతులు ఉంటారు. అందుకే ఈ రైతుల కోసం సైతం విత్తనాలు సిద్ధంగా ఉంచినట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వేరుశనగ 432 క్వింటాళ్లు, మినుము 90 క్వింటాళ్లు, పెసర 40 క్వింటాళ్లు, రాగి 80 క్వింటాళ్లు, కందులు 8.5 క్వింటాళ్లు, నువ్వులు 80 క్వింటాళ్లు, పిల్లి పెసర 2,171 క్వింటాళ్లను అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా ఎరువులను సైతం అధికారులు సమకూర్చారు. 86,274 టన్నుల ఎరువులు అవసరమని గుర్తించి ముందుగానే ఇండెంట్‌ పెట్టారు. వ్యవసాయ శాఖపరంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలు

ఈ ఏడాది ఖరీఫ్‌ ప్రణాళిక ఆధారంగానే ముందుకు వెళుతున్నాం. ఇప్పటికే అవసరమైన విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని రైతు సేవా కేంద్రాలకు తరలించాం. ఎరువులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటిని గోదాములు అందుబాటులో ఉన్న రైతుసేవా కేంద్రాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నాం. విత్తన కొరత అన్నది తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. రైతులకు అవసరమైన సాగు సూచనలు అందించేందుకు సైతం సిబ్బంది అందుబాటులో ఉన్నారు.

-వీటీ రామారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, విజయనగరం

-------------

Updated Date - Jun 04 , 2025 | 11:57 PM