సాగు పట్టాలు ఇవ్వండి
ABN , Publish Date - May 29 , 2025 | 12:13 AM
దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న కుడుమూరు రెవెన్యూ భూములకు పట్టాలు మంజూరు చేయాలంటూ గిరిజనులు డిమాండ్ చేశారు.
గిరిజనుల ఆందోళన
పాచిపెంట, మే 28 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న కుడుమూరు రెవెన్యూ భూములకు పట్టాలు మంజూరు చేయాలంటూ గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ముందుగా పలు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. బైఠాయించిన అనంతరం తహసీల్దార్ డి.రవికి వినతిపత్రం అందజేశారు. మండలంలోని కుడుమూరు రెవెన్యూ సర్వే నెంబరు 48లో 782 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఈ భూముల్లో గొట్టూరు పంచాయతీ తోకమెట్ట, మెట్టవలస, ఒడిసలమడ, ఇప్పలవలస, వేలుగానివలస, కుడుమూరు, తదితర 14 గ్రామాలకు చెందిన 300లకు పైగా గిరిజన కుటుంబాలు తరతరాలుగా సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. పలుమార్లు పోరాటాలు చేసిన మేరకు సర్వే చేయించి ప్రభుత్వ భూమిగా అధికారులు నిర్ధారించారని తెలిపారు. అయితే గిరిజనులకు చెందకుండా అన్యాక్రాంతం చేయడానికి కొంతమంది పెద్దలు వెనుకాడలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే సాగు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్‌వై నాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, గిరిజన సంఘం నాయకులు మంచాల శ్రీనివాసరావు, జన్ని రామయ్య, పలు గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు.