Girls There... Boys Here! బాలికలు అక్కడ.. బాలురు ఇక్కడ!
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:12 AM
Girls There... Boys Here! మక్కువ మండలం అనసభద్ర సమీపంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థులను వసతి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. తాగునీరు, ప్రహరీ ఇతరత్రా సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. డార్మెటరీ లేక ఇక్కడుండాల్సిన బాలికలను వేరే పాఠశాలకు పంపించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తీవ్రంగా వేధిస్తున్న వసతి సమస్య
పది గదులతో 315 విద్యార్థులకు తప్పని అవస్థలు
అంతంతమాత్రంగా తాగునీటి సౌకర్యం
ప్రహరీ నిర్మాణం చేపట్టని వైనం
144 మందికి కొటికపెంటలో తరగతులు
ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం
మక్కువ రూరల్, నవంబరు5(ఆంధ్రజ్యోతి): మక్కువ మండలం అనసభద్ర సమీపంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థులను వసతి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. తాగునీరు, ప్రహరీ ఇతరత్రా సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. డార్మెటరీ లేక ఇక్కడుండాల్సిన బాలికలను వేరే పాఠశాలకు పంపించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా ఈ ‘ఏకలవ్య’ను ఎర్రసామంతవలసలోని ఆశ్రమపాఠశాలలో సుమారు మూడేళ్ల పాటు నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలో అనసభద్ర వద్ద నిర్మించిన కొత్త భవనాల్లోకి మార్చారు. రూ.17కోట్ల వ్యయంతో పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టారు. అయితే రెండు అంతస్థుల్లో 20 గదులు నిర్మించాల్సి ఉండగా కింద అంతస్థులో 10 గదులను మాత్రమే నిర్మించి పాఠశాలకు భవనాలను అప్పగించారు. దీంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం వరకు 315మంది బాలురు, 144మంది బాలికలు చదువుతున్నారు. అయితే వసతి సమస్యతో పాటు ప్రహరీ లేని కారణంగా ఇక్కడ చదువుకోవాల్సిన 144మంది బాలికలను పాచిపెంట మండలం కొటికిపెంట ఏకలవ్యకు తరలించారు. అయితే ఇప్పటికే అక్కడున్న ఆ పాఠశాల విద్యార్థినులతో సర్దుకుంటూ వారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా పాఠశాల రెండో అంతస్థులో పది గదుల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోగా, 315 మంది బాలురకు సరిపడా తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు. ప్రస్తుతం ఒకబోరుతోనే వారు అవస్థలుపడాల్సి వస్తోంది. ఇక పాఠశాల భవనాల వెనుక భాగం నుంచే అడారిగెడ్డ ప్రవహిస్తోంది. దీంతో వర్షాలు కుసిన ప్రతిసారీ పాఠశాల ఆవరణ వెనుక భాగం క్రమక్రమంగా కోతకు గురవుతోంది. దీనివల్ల భవిష్యత్‌లో భవనాలు బీటలు వారి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ ప్రాంతంలో ప్రహరీ కంటే రక్షణగోడను బలంగా నిర్మించాలని, అదేవిధంగా తాగునీరు, వసతి సమస్యలపై స్పందించాలని విద్యార్థులు, ఉపాధ్యా యులు కోరుతున్నారు.
నిర్మాణాలు పూర్తయితే తరలిస్తాం..
‘ అనసభద్రలో రెండో అంతస్థులో పది గదులు, ప్రహరీ నిర్మాణం పూర్తయిన వెంటనే కొటిక పెంట పాఠశాలలో చదువుతున్న 144మంది బాలికలను ఇక్కడకు తరలిస్తాం. తాగునీటికోసం రెండు బోర్లును తక్షణమే ఏర్పాటు చేయాల్సి ఉంది. పాఠశాల వెనుక భాగం నుంచి అడారిగెడ్డ ప్రవహిస్తున్నందున 250మీటర్ల వరకు రక్షణ గోడను నిర్మించాలి.’ అని ఏకలవ్య ప్రిన్సిపాల్ కె.సురేష్ తెలిపారు.
ప్రతిపాదనలు పంపించాం..
‘సుమారు రూ.12 కోట్లతో అనసభద్ర ఏకలవ్య పాఠశాల కింద అంతస్థులో పది గదుల నిర్మాణం పూర్తి చేశాం. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ.కోటితో ప్రతిపాదనలు పంపించాం. కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. రూ.10లక్షలతో మూడు బోర్లు నిర్మాణానికి ప్రతిపాదించాం. రెండో బోరును రోడ్డుకు అవతల వైపు నిరిం్మచాం. నాలుగు రోజుల్లో కనెక్షన్ ఇచ్చి పాఠశాలకు తాగునీటిని సరఫరా చేస్తాం. ఇకపోతే సీసీరోడ్లు, కాలువల నిర్మాణానికి 60లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం.’ అని పార్వతీపురం ఐటీడీఏ ఏఈ పీవీ సత్యనారాయణ తెలిపారు.