బాలికలకు స్వీయ రక్షణ అవసరం
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:52 PM
జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల బాలికలకు స్వీయ రక్షణ అవసరమని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి
సీతానగరం/బెలగాం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల బాలికలకు స్వీయ రక్షణ అవసరమని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జోగంపేట కస్తూర్బా బాలికల విద్యాలయంలో సమగ్ర శిక్ష, రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘రాణి లక్ష్మీభాయ్’ స్వీయ రక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల, కళాశాల బాలికలకు ఆత్మ రక్షణ అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరికీ ఆత్మ రక్షణ అవసరమని, దాని ప్రాధాన్యతను బాలికలకు వివరించారు. విద్యతో పాటు స్వీయ రక్షణ నైపుణ్యాలు ముఖ్యమని తెలిపారు. ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎంత విద్య నేర్చినా ముందుగా మన ప్రాణాలను కాపాడుకునే తెలివి తేటలను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఉద్బోధించారు. బాలికలు భవిష్యత్‌లో ఉన్నత చదువులు చదివి పీహెచ్‌డీలు చేసి పెద్ద ఆఫీసర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం తనిఖీ చేసి, వారికి వడ్డించారు. ఈ కార్యక్రమంలో జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, కోఆర్డినేటర్ ఎస్.ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.