Yogandhra యోగాంధ్రకు సమాయత్తం కావాలి
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:09 AM
Get Ready for Yogandhra జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న జరగనున్న యోగాంధ్ర కార్యక్రమానికి సమాయత్తం కావాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు.
పార్వతీపురం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న జరగనున్న యోగాంధ్ర కార్యక్రమానికి సమాయత్తం కావాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం ఏడు గంటల నుంచి 8 గంటల వరకు విశాఖలో జరిగే యోగాంధ్రలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 3,150 వేదికల వద్ద యోగా కార్యక్రమం నిర్వహించాలి. ఇప్పటికే నమోదు చేసుకున్న 5.42 లక్షల మంది ఆ రోజు యోగాంధ్రలో పాల్గొనేలా అధికారులు చర్యలు చేపట్టాలి. ప్రజలతో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములయ్యేలా చూడాలి. అదే రోజు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉంటుంది. డీఏ జుగా ద్వారా ప్రతి గిరిజన కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించాలి.’ అని తెలిపారు.ఈ సమావేశంలో డీఆర్వో కె.హేమలత డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీపీవో టి.కొండలరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, గిరిజన సంక్షేమశాఖ డీడీ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి విజేతలకు అభినందనలు
రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీల్లో విజేతలుగా నిలిచిన పది మంది జిల్లా వాసులను కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అభినందించారు. గురువారం తన చాంబర్‌లో కలిసిన విజేతలను ప్రశంసిస్తూ జిల్లాకు మంచి గుర్తింపు తెచ్చారని కొనియాడారు. రాష్ట్రస్థాయిలో జిల్లాకు ద్వితీయ స్థానం రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
నేడు రెవెన్యూ దినోత్సవం
జిల్లాలో శుక్రవారం రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహిస్తామన్నారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలోనూ రెవెన్యూ డే జరపాలని ఆదేశించారు. రెవెన్యూ ఉద్యోగుల బాధ్యతలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
సికిల్‌సెల్ అనీమియా నిర్మూలనే ధ్యేయం
సికిల్ సెల్ అనీమియా నిర్మూలన ధ్యేయంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత పోస్టర్‌ను విడుదల చేశారు. జిల్లాలో 1,36,361 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 287 మంది సికిల్ సెల్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. వ్యాధి గ్రస్థులను మందులు అందజేసి వారి ఆరోగ్యాన్ని వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి వ్యాధి ముదరకుండా చూడాలన్నారు.