Share News

అర్ధాంతరంగా ముగిసిన సర్వసభ్య సమావేశం

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:29 AM

స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మహంతి కల్యాణి ఆధ్వర్యంలో గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.

అర్ధాంతరంగా ముగిసిన సర్వసభ్య సమావేశం

పూసపాటిరేగ, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మహంతి కల్యాణి ఆధ్వర్యంలో గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. సమావేశంలో పేరాపురం ఎంపీటీసీ పతివాడ తమ్మినాయుడు మాట్లాడుతూ కొవ్వాడలో గల శ్మశానవాటికను ఎలా తొలగించారంటూ అధికారులను ప్రశ్నించగా.. ఏపీవో స్పందిస్తూ దీనిపై గ్రామసభలు నిర్వహించామని, నివేదికలు పైకి పంపించామని.. విచారణ జరుగుతోందన్నారు. దీనిపై వైసీపీ మండల అధ్యక్షుడు, పతివాడ ఎంపీటీసీ పతివాడ అప్పలనాయుడు కలుగజేసుకుని ఈ విధంగానేనా అధికారులు సమాధానం ఇచ్చేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొవ్వాడఅగ్రహారానికి చెందిన సర్పంచ్‌ కోట్ల రఘు మాట్లాడుతూ ఈ విషయమై ప్రతిసారి తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కోట్ల రఘును సమాధానం ఇవ్వనివ్వకుండా వైసీపీ నాయకులు అడ్డుపడ్డారు. దీంతో ఆయన ఈ సభను సక్రమంగా నడపకుంటే ఎలా అంటూ అసహనం వ్యక్తంచేస్తూ మైక్‌ను విసిరివేశారు. దీంతో మరింత గందరగోళ పరిస్థితి నెలకొనటంతో సభను ఎంపీపీ అర్ధాంతరంగా నిలిపివేశారు. దీనిపై వెంపడాం, కొవ్వాడ అగ్రహారం, కందివలస పంచాయతీలకు చెందిన సర్పంచ్‌లు అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈవోపీఆర్డీ జ్ఞానేశ్వరరావు, సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావులు వచ్చి వీరికి నచ్చచెప్పటంతో అక్కడి నుంచి నిష్క్రమించారు.

Updated Date - Oct 31 , 2025 | 12:29 AM