Share News

Gas Tanker ఘాట్‌ రోడ్డులో గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:25 AM

Gas Tanker Overturns on Ghat Road ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం పాచిపెంట మండలంలోని రొడ్డవలస సమీపంలోని ఘాట్‌ రోడ్డు వద్ద గ్యాస్‌ ట్యాంకరు బోల్తా పడింది. దీంతో నాలుగు రాష్ర్టాల వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

 Gas Tanker  ఘాట్‌ రోడ్డులో గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా
క్రేన్‌ల సాయంతో ట్యాంకరును పైకి తీస్తున్న దృశ్యం

  • నాలుగు రాష్ట్రాల వాహనదారులు, ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

పాచిపెంట, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం పాచిపెంట మండలంలోని రొడ్డవలస సమీపంలోని ఘాట్‌ రోడ్డు వద్ద గ్యాస్‌ ట్యాంకరు బోల్తా పడింది. దీంతో నాలుగు రాష్ర్టాల వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు 25 టన్నుల గ్యాస్‌ లోడుతో విశాఖ నుంచి ఒడిశా వైపు వెళ్తున్న ట్యాంకర్‌ సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు ఆ ప్రాంతంలోని ఘాట్‌రోడ్డు లోయలో బోల్తా పడింది. సుమారు 50 మీటర్ల దిగువకు పడిపోవడంతో .. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పూర్తిస్థాయి భద్రతల నడుమ ఎనిమిది క్రేన్ల సాయంతో గ్యాస్‌ ట్యాంకరును బయటకు తీసే చర్యలు చేపట్టారు. ఈ సమయంలో గ్యాస్‌ లీక్‌ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనదారులు, ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఘాట్‌ రోడ్డు ప్రారంభంలోనే వాహనాలు నిలిపివేశారు. దీంతో మంగళ వారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా సహాయక చర్యలు నిలిపివేసి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. మంగళవారం ట్యాంకరు తీయడం కుదరకపోవడంతో బుధవారం కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాహనాలు నిలిపివేశారు. దీంతో ఆంధ్రా, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన వాహనదారులు, ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. బస్సులు, లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలు సైతం నిలిచిపోయాయి. సాయంత్రం 5:30 తర్వాత ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడంతో యథావిధిగా వాహన రాకపోకలు సాగాయి. సాలూరు రూరల్‌ సీఐ రామకృష్ణ, పాచిపెంట పోలీసులు, జిల్లా అగ్నిమాపక అధికారి పి.సింహాచలం తదితరులు సహాయక చర్యలు చేపట్టారు.

Updated Date - Oct 23 , 2025 | 12:25 AM