garividi facor in sad position గరివిడి ఫేకర్‌పై నీలినీడలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:23 AM
garividi facor in sad position గరివిడిలోని ఫేకర్ ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. దేశంలో ఫెర్రో ఎల్లాయిస్‌లో మొట్టమొదటి పరిశ్రమగా గరివిడి ఫేకర్‌కు పేరుంది. అలాంటి పరిశ్రమ కాలక్రమంలో ఎదురైన ఒడుదుడుకులకు తిరోగమన బాట పట్టింది. దాదాపు రెండేళ్ల నుంచి లేఆఫ్‌లో ఉంది.
గరివిడి ఫేకర్‌పై నీలినీడలు
2023 అక్టోబర్ నుంచి లేఆఫ్‌లోనే
పూర్వవైభవం వస్తుందా?
ఎలాంటి ప్రకటన ఇవ్వని యాజమాన్యం
అయోమయంలో కార్మికులు
గరివిడి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): గరివిడిలోని ఫేకర్ ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. దేశంలో ఫెర్రో ఎల్లాయిస్‌లో మొట్టమొదటి పరిశ్రమగా గరివిడి ఫేకర్‌కు పేరుంది. అలాంటి పరిశ్రమ కాలక్రమంలో ఎదురైన ఒడుదుడుకులకు తిరోగమన బాట పట్టింది. దాదాపు రెండేళ్ల నుంచి లేఆఫ్‌లో ఉంది.
గరివిడిలో 1956వ సంవత్సరం మార్చి 18న మహారాష్ట్రలోని తుస్సార్ జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ ఫేకర్ పరిశ్రమను స్థాపించారు. దాదాపు 60 సంవత్సరాల వరకు పరిశ్రమ దిగ్విజయంగా నడిపారు. సుమారు వెయ్యి మంది వరకు కార్మికులు పనిచేస్తుండేవారు. పరోక్షంగా గరివిడి, దువ్వాం, దుమ్మెద తదితర 10 పంచాయతీల ప్రజలు ఆధారపడి జీవిస్తుండేవారు. అయితే గత 10 సంవత్సరాల నుంచి ఫేకర్ తరచూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ వస్తోంది. తరచూ లేఆఫ్‌లు ప్రకటిస్తోంది. కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా గరివిడి ఫేకర్ మనుగడపై కూడా ప్రభుత్వాల విధానాలు, యాజమాన్య తప్పిదాల ప్రభావం పడింది. చివరగా 2023 అక్టోబర్ నెలలో లేఆఫ్‌కు గురైన ఫేకర్ ఇంతవరకు తెరుచుకోలేదు. ఫేకర్‌లో ఉన్న శాశ్వత కార్మికులను కూడా యాజమాన్యం పూర్తిగా తొలగించింది. ఫేకర్‌లో గతంలో రైల్వే వ్యాగన్ లోడింగ్, లారీ లోడింగ్ విభాగంలో పనిచేసిన 116 మందికి యాజమాన్యం లేఆఫ్ జీతాలు ఇస్తోంది. ఫేకర్‌పై ఆధారపడిన 90 మంది కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా 56 మంది సూపర్‌వైజర్లకు కూడా నెలకు 15 రోజులు మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారు.
సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫేకర్‌లో ఆరు ఫర్నీసుల ద్వారా ఫెర్రో అల్లాయిస్‌ను ఉత్పత్తి చేస్తుండేవారు. అయితే ఫేకర్ యాజమాన్యం ఇటీవల ఎక్సకవేటర్లతో ఫర్నీసులకు సంబంధించిన యంత్రాలను తొలగిస్తోంది. యంత్రాలు పూర్తిగా పాతవైపోయాయని, వీటి ద్వారా ముడిసరుకు ఉత్పత్తి చేస్తే ఆర్థిక భారం పెరుగుతుందని యాజమాన్యం చెబుతోంది. ఈ యంత్రాలను తొలగించి వీటి స్థానంలో కొత్తవి అమర్చి పరిశ్రమను పునఃప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దానిపై ఎటువంటి స్పష్టత లేదు. మొత్తంగా చూసుకుంటే గరివిడి ఫేకర్ పరిస్థితి పూర్తిగా కళ తప్పిందని చెప్పకత ప్పదు.