గంగాధర్‌కు కీర్తిచక్ర పురస్కారం
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:12 AM
బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లికి చెందిన వీణల తయారీ కళాకారుడు సర్వసిద్ధి గంగాధర్ ఆచారికి అరుదైన గౌరవం దక్కింది.
- బొబ్బిలి వీణల తయారీ కళాకారునికి అరుదైన గౌరవం
- హైదరాబాద్‌లో అవార్డు ప్రదానం
బొబ్బిలి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లికి చెందిన వీణల తయారీ కళాకారుడు సర్వసిద్ధి గంగాధర్ ఆచారికి అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్‌కు చెందిన శ్రీఆర్యాణి సకల కళావేదిక గంగాధర్‌కు జాతీయస్థాయి కీర్తిచక్ర పురస్కారం, స్వర్ణకంకణంతో సత్కరించింది. సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 20న హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ అవార్డును ప్రదానం చేసింది. గంగాధర్ 40 ఏళ్లుగా వీణల తయారీ వృత్తిలో జీవనం సాగిస్తున్నారు. తన తండ్రి వీరన్న వీణల తయారీలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించారని, ఆయన ఆశీస్సులు, వారసత్వంగా ఈ కళలో నైపుణ్యం తనకు దక్కిందని గంగాధర్ అంటున్నారు. తన కళానైపుణ్యానికి తెలంగాణలో పురస్కారం లభించడం ఆనందంగా ఉందన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) తన సొంత ఖర్చులతో బొబ్బిలి సంగీత వీణను తయారుచేయించి అయోద్య రామమందిరానికి బహూకరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ వీణను గంగాధర్ తయారు చేస్తున్నారు. ఇది తుది దశకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. పురస్కారం అందుకున్న గంగాధర్‌ను ఎమ్మెల్యే బేబీనాయన, మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్‌బాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు తదితరులు అభినందించారు.