Galiwana disaster గాలీవాన బీభత్సం
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:54 AM
Galiwana disaster జిల్లా అంతటా గాలీవాన బీభత్సం సృష్టించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగండం ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకూ ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి చాలా చోట్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
గాలీవాన బీభత్సం
జిల్లా వ్యాప్తంగా నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
అరటి, బొప్పాయి, మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం
ఆంధ్రజ్యోతి బృందం, అక్టోబరు3(ఆంధ్రజ్యోతి): జిల్లా అంతటా గాలీవాన బీభత్సం సృష్టించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగండం ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకూ ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి చాలా చోట్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రాజాం సమీపంలోని ఒమ్మి గ్రామం వద్ద భారీవృక్షం రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. సారధిగెడ్డ పొంగిపొర్లింది. బొబ్బిలి మండలంలో అరటి, చెరకు, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లో సుమారు 25నుంచి 30 ఎకరాల్లో అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగాయి. గజపతినగరం మండలంలోని చిట్టయ్యవలస గ్రామంలో భారీ వర్షాలకు తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి ఐదు గేదెలు శుక్రవారం మృతిచెందాయి. చంపావతి నదీ ప్రవాహం ఉధృతం కావడంతో గజపతినగరం మండలంలోని మర్రివలన గ్రామం మీదుగా వెళ్లే ఐదు గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకోవైపు నాగావళి, వేగావతి, సువర్ణముఖి నదులు పొంగడంతో వంగర మండలంలోని మడ్డువలస రిజర్వాయర్‌లో అధికంగా నీరు చేరింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి నీటిని నాగావళిలోకి వదులుతున్నారు. దత్తిరాజేరు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షానికి మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది.
వరదపై అప్రమత్తం: కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
రేగిడి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): నాగావళి, ఇతర వాగుల వరద ఉధృతిపై రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ప్రజల జీవనానికి ఇబ్బంది రాకూడదని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. లోతట్టువాసుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కృష్ణలతను ఆదేశించారు. రేగిడి మండలంలో సంకిలి నాగావళి తీరం లోతట్టుగ్రామ మైన బొడ్డవలసను ఆయన శుక్రవారం సందర్శించారు. నదిలో వరదనీటి వివరాలపై ఆరా తీశారు. వర్షాలు ఎక్కువైతే పునరావాస కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. వీఆర్‌వోలు నదీతీర గ్రామాలను పర్యవేక్షిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బొడ్డవలస గ్రామస్థులతో కలెక్టర్ మాట్లాడి గతంలో వరద అనుభవాలను వారినుంచి తెలుసుకొన్నారు. ఆయన వెంట చీపురపల్లి అర్‌డీవో ఆశయ్య, ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
కలెక్టర్‌తో సీఎం వీడియో కాన్ఫరెన్స్
విజయనగరం కలెక్టరేట్, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిస్థితులపై సీఎం చంద్రబాబునాయుడు కలెక్టర్ రామసుందర్‌రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో శుక్రవారం మాట్లాడారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ రామసుందర్‌రెడ్డి జిల్లా అధికారులు, సిబ్బందితో వీడియోకాన్ఫరెన్స్‌లో సూచనలు ఇచ్చారు. వర్షాలకు దసరా రోజంతా ప్రజలు బయటకు రాలేకపోయారు. చాలా చోట్ల విద్యుత్ వైర్లపై చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. పండగ పూట ప్రజలు చీకటిలో గడపాల్సి వచ్చింది. రాత్రి సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది పడిన చెట్ల కొమ్మలను తొలిగిస్తూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సిబ్బంది నిద్ర లేకుండా రాత్రి అంతా విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు.
నాగావళి ఉధృతి
వణుకుతున్న తీరప్రాంత వాసులు
రేగిడి, అక్టొబరు 3,(ఆంధ్రజ్యోతి): ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి శుక్రవారం సాయంత్రానికి మరింత ఉగ్ర రూపం దాల్చింది. నదీప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో రేగిడి మండలంలో నదీతీరంలో ఉన్న 12 లోతట్టు గ్రామాల ప్రజలు భయంనీడలో ఉన్నారు. పెద్దపుర్లి, ఖండ్యాం గ్రామాల్లోకి వరద నీరు అధికంగా వస్తోంది. ఖండ్యాం, బొడ్డవలస గ్రామాలదీ ఇదే పరిస్థితి. ఈరాత్రి వరద ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు. లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు తహసీల్దార్ కృష్ణలత తెలిపారు.