Share News

Funds Utilization నిధుల వినియోగం.. ఇష్టారాజ్యం

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:15 AM

Funds Utilization… A Free-for-All జిల్లాలో వివిధ పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల మేరకు వినియోగించడం లేదు. అనధికార పనులకు ఇష్టారాజ్యంగా వెచ్చిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది.

Funds Utilization    నిధుల వినియోగం.. ఇష్టారాజ్యం
కొమరాడ సచివాలయం

  • కొన్నిచోట్ల ఖర్చులన్నీ రికార్డులకే పరిమితం

  • కొరవడిన అధికారుల పర్యవేక్షణ

  • ఇదీ పలు పంచాయతీల్లో పరిస్థితి

పార్వతీపురం, నవంబరు22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల మేరకు వినియోగించడం లేదు. అనధికార పనులకు ఇష్టారాజ్యంగా వెచ్చిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. వాస్తవంగా పంచాయతీల్లో జనాభా ప్రాతిపదికన 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక్కో వ్యక్తికి రూ.500 చొప్పున కేంద్రం కేటాయిస్తుంది. అయితే జిల్లాలోని చాలా పంచాయతీల్లో అనధికార పనులకు ఇష్టారాజ్యంగా ఆ నిధులు వినియోస్తున్నారు. దీంతో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌ నిర్వహణ కష్టతరమవుతోంది. మొత్తంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు కూడా సాగడం లేదు.

ఇదీ పరిస్థితి..

- కేంద్ర ప్రభుత్వం 2024-25కు సంబంధించి జిల్లాకు రెండు సార్లు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి , ఏప్రిల్‌ నెలల్లో రూ. 38.73 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తంతో జిల్లాలోని 451 పంచాయతీల్లో అనేక పనులు చేపట్టాల్సి ఉంది. కానీ అత్యధిక శాతం నిధులు పారిశుధ్య పనులు, కార్మికుల జీతాలకే చెల్లిస్తున్నారు.

- పంచాయతీలకు మంజూరయ్యే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 30 శాతం పారిశుధ్య కార్మి కుల వేతనాలు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ షేడ్స్‌ నిర్వహణ, చెత్త తరలించే వాహనాలు మర మ్మతులకు వినియోగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా మరో 30 శాతం నిధులు తాగునీరు నిర్వహణ, మోటార్లు, పైపులైన్ల మరమ్మతులు, ప్యానెల్‌ బోర్డుల నిర్వహణ, కొత్త పైపులైన్లు ఏర్పాటు కోసం వెచ్చించనున్నారు. ఎల్‌ఈడీ దీపాల నిర్వహణ కోసం పది శాతం , విద్యుత్‌ బిల్లుల చెల్లింపు కోసం మరో పది శాతం నిధులు వినియోగించనున్నారు. మరో 15 శాతం నిధులు అభివృద్ధి లక్ష్యాల సాధన, మొక్కల పెంపకం, ఐదు శాతం గ్రామసభల నిర్వహ ణకు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వినియోగం ఇలా..

- నిబంధనల ప్రకారం నిధులు వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో భిన్న పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు గ్రామసభల నిర్వహణకు ఐదు శాతం నిధులు వెచ్చించాల్సి ఉంది. అయితే చాలా పంచాయతీల్లో ఉన్నతాధికారులు ఆదేశిస్తే తప్ప గ్రామసభలు నిర్వహించడం లేదు. తాగునీటి ట్యాంకులు నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. కాలువల నిర్వహణ ఏడాదికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే చేపడుతున్నారు.

- పంచాయతీలకు మంజూరవుతున్న నిధులు ఏ మాత్రం సరిపోవడం లేదని కొంతమంది అధికారులు చెబుతున్నారు. అయితే ఆయా నిధులతో క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనులపై వారి పర్యవేక్షణ కొరవడిందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

- కొమరాడ పంచాయతీలో సుమారు రూ.20 లక్షలకు పైబడి 15వ ఆర్థిక సంఘం నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారన్న ఆరోపణలున్నాయి. దీనిపై ఇప్పటికే సర్పంచ్‌కు షోకోజ్‌ నోటీసు ఇచ్చారు. అయితే అధికారుల పర్యవేక్షణ ఉంటే ఇలా జరిగేనా? అన్నది చర్చనీయాంశమవుతోంది.

- క్లాప్‌ మిత్రలు, విద్యుత్‌ చార్జీల బిల్లుల చెల్లింపులకు 15వ ఆర్థిక సంఘం నిధులు వెచ్చిస్తున్నట్లు కొన్ని పంచాయతీలు చెబుతున్నప్పటికీ అవన్నీ కాగితాల వరకేనన్న వాదనలు లేకపోలేదు.

- అనధికార ఖర్చులు కూడా పంచాయతీల ఖాతాల్లో నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీల సందర్శన లేదా ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగిస్తున్న పరిస్థితి ఉంది.

నిబంధనల ప్రకారమే వినియోగం

నిబంధనల ప్రకారం పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు వెచ్చిస్తున్నాం. ఇతర పనులకు ఆ నిధులను వినియోగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. కొమరాడలో ఇష్టారాజ్యంగా 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు పెట్టారన్న ఆరోపణపై విచారణ చేశాం. సర్పంచ్‌కు షోకాజ్‌ నోటీసు అందించాం.

- కొండలరావు, డీపీవో, పార్వతీపురం మన్యం

Updated Date - Nov 23 , 2025 | 12:15 AM