Funds Sanctioned నిధులు మంజూరైనా ముందుకు రాలే!
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:40 PM
Funds Sanctioned but Yet to Be Utilized! కురుపాం నియోజకవర్గంలో ఉన్న ముఖ్య సమస్యల్లో పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం ఒకటి. ఏళ్లు గడుస్తున్నా దీని పనులకు మోక్షం లభించడం లేదు. దీంతో ఆయా ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
టెండర్లు పిలిచినా ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు
అదనపు నిధుల కోసం ఈఎన్‌సీకి లేఖ రాయనున్న అధికారులు
త్వరగా నిర్మాణం పూర్తిచేయాలంటున్న ప్రజలు
జియ్యమ్మవలస, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): కురుపాం నియోజకవర్గంలో ఉన్న ముఖ్య సమస్యల్లో పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం ఒకటి. ఏళ్లు గడుస్తున్నా దీని పనులకు మోక్షం లభించడం లేదు. దీంతో ఆయా ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాం (2014-19)లో 80 శాతం వంతెన పనులు పూర్త య్యాయి. కానీ ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిపై సరిగ్గా దృష్టి సారించలేదు. 20 శాతం పనులు అలాగే ఉండిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంతెన నిర్మాణంపై దృష్టి సారించింది. ఇటీవల నిధులు కూడా మంజూరు చేసింది. అయితే టెం డర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవు తున్నారు. అదనపు నిధుల కోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు వారు చెబుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- కొమరాడ మండలాన్ని రెండుగా విభజించేది నాగావళి నది. ఈ మండలంలో 31 పంచాయతీలు, 154 గ్రామాలు ఉన్నాయి. నాగావళి నదికి తూర్పు వైపు దళాయిపేట, మాదలింగి, గుణదతీలేసు, కెమిశీల, కొట్టు, తొడుము, పాలెం, వన్నాం పంచాయతీలు, వాటి పరిధిలో 38 గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతం, వీరు మండల కేంద్రానికి వెళ్లాలంటే 75 కిలో మీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి. మండల అధికా రులు ఈ ప్రాంతానికి రావాలంటే అంతే దూరం ప్రయాణించాలి. పూర్ణపాడు - లాబేసు వంతెన పూర్తయితే ఆయా ప్రాంతవాసులు 25 కిలో మీటర్లు ప్రయాణిస్తే చాలు మండల కేంద్రానికి వెళ్లిపోతారు.
- వర్షా కాలంలో ఆ గ్రామస్థులు నాగావళి నదిపై పడవలో ప్రయాణించి మండల కేంద్రానికి వెళ్లాల్సిన దుస్థితి. గతంలో ఆంధ్రా - ఒడిశా సరిహద్దు వనజ గ్రామం వద్ద నాటు పడవ మునిగిపోయి 35 మంది చనిపోయారు. వీరందరూ కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ మండలాలకు చెందిన వారే. ఈ నేపథ్యంలో అటువంటి ఘటనలు పునరావృతం కాకముందే పూర్ణపాడు - లాబేసు వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.
గతంలో ఇలా..
- పూర్ణపాడు - లాబేసు వంతెన పనులు 2006లో శ్రీకారం చుట్టారు. రూ. 3.20 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయిస్తూ ఈ బాధ్యతను గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించారు. 2009 జూన్ 3న టీడబ్ల్యూ ఇంజనీరింగ్ విభాగాన్ని తప్పించి ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ శాఖకు ఆ బాధ్యతలు అప్పగించారు. 2010, మార్చి 22న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి పనులు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- 2011, ఏప్రిల్ 27న ఈ వంతెన నిర్మాణ వ్యయం పెరిగింది. అప్పటి రేట్ల ప్రకారం రూ. 7 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రీయ శామ్ వికాశ్ యోజన (ఆర్‌ఎస్‌వీవై) నుంచి రూ. 3.50 కోట్లు, నాబార్డు నుంచి రూ. 3.50 కోట్లు మంజూరు చేశారు. నిర్మాణ బాధ్యతను ఎం/ ఎస్ వెంకట పాండురంగ కనస్ట్రక్షన్స్ (విశాఖ)కు అప్పగించారు. అయితే సకాలంలో పనులు ప్రారంభించకపోవడంతో వారి కాంట్రాక్టును రద్దు చేశారు.
- 2015 జనవరి 23న మళ్లీ కొత్త ఎస్టిమేట్లు వేశారు. రూ. 9.58 కోట్లతో అదే ఏడాది మే 25న ఎం/ఎస్ ఆర్‌ఆర్ ఇన్‌ఫ్రా వర్క్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు పనులు అప్పగించారు. 2017 మే 24 నాటికి పనులు పూర్తి చేయాలని మొదట నిర్ణయించారు. అయితే 2020, జూన్ 20 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ధరలు పెరగడంతో రూ. 14 కోట్లకు రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ (ఆర్‌ఏఎస్) రూపంలో నిధులు పెంచారు. 2018 నాటికి 80 శాతం పనులు పూర్తయ్యాయి. 2019-2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరించడంతో పూర్ణపాడు - లాబేసు వంతెన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
జరిగిన పనులు ఇవీ..
పూర్ణపాడు-లాబేసు వంతెన పనులు నాగావళి నదిపై 11 పిల్లర్లతో నిర్మించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా 7వ పిల్లర్ నుంచి 11వ పిల్లర్ వరకు ఓపెన్ ఫౌండేషన్ శ్లాబ్ లెవెల్ పూర్తి చేశారు. రెండు అబుట్‌మెంట్లు, 12 శ్లాబ్‌లలో ఏడు శ్లాబులు పూర్తి చేశారు. పూర్ణపాడు వైపు 30 మీటర్ల వరకు ఎప్రోచ్ వాల్స్ పూర్తి చేశారు. ఒకటో స్తంభం వద్ద శ్లాబ్ కంటే కంచెం తక్కువ స్థాయి వరకు నిర్మాణం జరిగింది. మిగిలిన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై సంబంధిత కాంట్రాక్టర్‌కు పలుమార్లు నోటీసులు పంపినా ఎటువంటి స్పందన లేదు. పెండింగ్ బిల్లులు మంజూరుతో పాటు రీఎస్టిమేట్లు వేసి నిధులు పెంచకపోతే ఏమీ చేయలేమని సదరు కాంట్రాక్టర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి మెయిల్ ద్వారా తెలియజేశారు. దీంతో మళ్లీ రూ.15.80 కోట్లు కావాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మే 13న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సమావేశమై రూ.14 కోట్లతోనే పనులు చేయాలని ఆదేశించారు. రూ. 8కోట్లతో నిర్మాణాలు జరిగాయని, మరో రూ.7 కోట్లతో పనులు చేయాల్సి ఉందని అధికారులు ఇంజనీరింగ్ అండ్ చీఫ్‌కు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ విప్ జగదీశ్వరి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి నిధులు పెంచాలని కోరగా.. రూ.15కోట్లు మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది.
టెండర్లు పిలిచినా..
వంతెన మిగిలిన పనులు పూర్తికి రూ.15 కోట్లతో రీఎస్టిమేట్లు వేయగా.. దీనికి పరిపాలన ఆమోదం లభించింది. ఇందులో గత కాంట్రాక్టర్ చేసిన పనులకు గాను ఈ ఏడాది ఆగస్టు 22న ఇంజనీరింగ్ రూ. 8.75 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ.7.36 కోట్లతో ఎస్టిమేట్లు సిద్ధం చేసి సెప్టెంబరు 15న సాంకేతిక అనుమతి కోసం చీఫ్ ఇంజనీర్‌కు పంపించారు. దీంతో ఈ నెల 1 నుంచి 16 వరకు టెండర్లు పిలిచారు. అయితే కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. వాస్తవంగా రూ.7.36 కోట్ల అంచనా వ్యయంలో 18 శాతం ప్రభుత్వ పన్ను పోగా వంతెన పనులకు సంబంధించి రూ. 4.67 కోట్లు మాత్రమే కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సి ఉందని నిబంధన ఉంది. దీంతో నిధులు చాలవనే కారణంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు.
నిధులు పెంచాలని లేఖ రాస్తాం
పూర్ణపాడు-లాబేసు వంతెన పనులకు గాను రూ.7.36 కోట్లతో టెండర్లు పిలిచాం. కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని మరో 5శాతం నిధులు పెంచాలని ఉన్నతాధి కారులకు లేఖ రాస్తాం.
- వీఎస్ నగేష్‌బాబు, డీపీఆర్‌ఈవో, పార్వతీపురం మన్యం జిల్లా