Share News

Funds for the maintenance of schools... విద్యాలయాల నిర్వహణకు నిధులొచ్చాయ్‌...

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:11 AM

Funds for the maintenance of schools... ఐదేళ్ల వైసీపీ నిర్లక్ష్యానికి గురై గాడితప్పిన విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల నిర్వహణకు అవసరమైన నిధుల్ని తాజాగా విడుదల చేసింది.

Funds for the maintenance of schools... విద్యాలయాల నిర్వహణకు  నిధులొచ్చాయ్‌...

విద్యాలయాల నిర్వహణకు

నిధులొచ్చాయ్‌...

జిల్లాకు తొలివిడత రూ.2.15 కోట్లు

త్వరలో హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్ల ఖాతాల్లో జమ

ఐదేళ్లు నిర్లక్ష్యం చేసిన వైసీపీ

రాజాం రూరల్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ నిర్లక్ష్యానికి గురై గాడితప్పిన విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల నిర్వహణకు అవసరమైన నిధుల్ని తాజాగా విడుదల చేసింది. మరో వారం రోజుల్లో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ల ఖాతాల్లో జమ చేసేందుకు సమగ్రశిక్ష అభియాన్‌ అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాలయాల్లో నెలకొన్న కష్టాలు త్వరలో తీరనుండడంతో గురువులు ఊరట చెందుతున్నారు.

తొలివిడత గా రూ.2.15 కోట్లు

జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలలు మినహా 1770 పాఠశాలలు, కళాశాలల నిర్వహణకు తొలివిడతగా రూ.2.15 కోట్ల కాంపోజిట్‌ నిధుల్ని ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు కళాశాలల నిర్వహణకు ఈ మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది. విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని జిల్లాకు రూ.4.30 కోట్లు అవసరం కాగా తొలివిడతగా 50 శాతం నిధుల్ని మంజూరు చేసింది. ఇప్పటికే సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యామిత్ర పథకం కింద విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారాలు, బూట్లు తదితర మెటీరియల్‌తో కూడిన విద్యామిత్ర కిట్లు అందజేసింది. తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13 వేలు వంతున నిధుల్ని జమచేసింది.

వైసీపీ హయాంలో నిర్లక్ష్యం

ఐదేళ్ల వైసీపీ పాలనలో సుద్దముక్కలు, చీపుర్లు, రసాయనాలు కొనుగోలు చేయాలంటే ఉపాధ్యాయవర్గాలు దిక్కులు చూడాల్సి వచ్చేది. అదిగో పద్దు.. ఇదిగో పద్దు....నిధులొచ్చాయి.. తీసుకోండంటూ ఉపాధ్యాయుల్ని ఊరిస్తూ, ఊదరగొడుతూ వైసీపీ హయాంలో కాలక్షేపం చేశారు. నిధులు మంజూరు చేశామంటూ ప్రకటించి సకాలంలో ఆర్ధిక అనుమతులు రాక నిధుల్ని హెచ్‌ఎంల ఖాతాల్లోకి జమచేయని సందర్భాలూ లేకపోలేదు. దీంతో పాఠశాలల నిర్వహణకు అయ్యే ఖర్చులు ప్రధానోపాధ్యాయులు జేబులో నుంచి పెట్టుకున్న దుస్థితి గతంలో చోటుచేసుకుంది.

మార్గదర్శకాలివీ...

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కాంపోజిట్‌ గ్రాంట్‌ వినియోగంపై సమగ్రశిక్ష రాష్ట్ర ఉన్నతాధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఆయా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా విడుదలైన నిధుల్ని కాస్త అటు ఇటుగా ఖర్చు చేయాల్సిన విధానాన్ని స్పష్టం చేశారు. సుద్దముక్కలు, తెల్లకాగితాలు, రిజిష్టర్లు, పరీక్షల నిర్వహణకు రూ.5 వేలు, ఆగస్టు 15, రిపబ్లిక్‌ డే నిర్వహణకు రూ.2 వేలు, విద్యుత్‌ బిల్లుల చెల్లింపునకు రూ.3,500, ఇంటర్నెట్‌ కోసం రూ.2 వేలు, జిరాక్స్‌కు రూ.2 వేలు, శానిటైజర్‌, ఫినాయిల్‌ తదితర ఖర్చుల కోసం రూ.2,500, తాగునీటికి రూ.2,500, పారిశుధ్యం, మరుగుదొడ్లు నిర్వహణకు రూ.2,500 ఖర్చు చేసే వెసులుబాటు కల్పించారు. మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశాల నిర్వహణకు ఇచ్చిన నిధుల్లో 20 శాతం ఖర్చు చేయవచ్చు. ఫ్లోరింగ్‌, తలుపులు, కిటికీలకు సంబంధించి చిన్నచిన్న మరమ్మతులు సైతం చేసుకునే వీలుంది. తొలిదశలో విడుదల చేసిన నిధులు సద్వినియోగం చేస్తే రెండోవిడత నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని సమగ్రశిక్ష అభియాన్‌ ఏపీసీ ఏ.రామారావు తెలిపారు.

తొలివిడతగా రూ.2.15 కోట్లు

ఎ.రామారావు, ఏపీసీ, సమగ్రశిక్ష అభియాన్‌, విజయనగరం

జిల్లాలోని 1770 పాఠశాలలు, కళాశాలల నిర్వహణకు తొలివిడతగా రూ.2.15 కోట్లు నిధులు విడుదల అయ్యాయి. త్వరలో ఆయా పాఠశాలల హెచ్‌ఎం.లు, కళాశాలల ప్రిన్సిపాళ్ల ఖాతాలకు జమచేస్తాం. పిఎం.శ్రీ పాఠశాలలకు మాత్రం శతశాతం నిధులు విడుదలయ్యాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కాంపోజిట్‌ నిధుల్ని వినియోగించాల్సి ఉంటుంది.

Updated Date - Jul 03 , 2025 | 12:11 AM