Share News

నిధులు పక్కదారి.. విచారణ ఎప్పుడో మరి!

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:14 PM

Funds Diverted… But When Will the Inquiry Happen? జిల్లాలోని పలు పంచాయతీల నిధులు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌కు అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్వయంగా కలెక్టర్‌ ఆదేశించినా సంబంధిత శాఖాధికారులు స్పందించడం లేదు.

 నిధులు పక్కదారి.. విచారణ ఎప్పుడో మరి!
కొమరాడ గ్రామ సచివాలయం

  • కొమరాడలో విచారణ చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశం

  • ఆ శాఖాధికారుల జాప్యంపై పలు అనుమానాలు

పార్వతీపురం, ఆగస్టు12(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు పంచాయతీల నిధులు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌కు అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్వయంగా కలెక్టర్‌ ఆదేశించినా సంబంధిత శాఖాధికారులు స్పందించడం లేదు. కొన్నిచోట్ల తూతూ మంత్రంగా విచారణ జరిపి క్షేత్రస్థాయి సిబ్బందిని సస్పెండ్‌ చేస్తున్నారు తప్ప రికవరీ ఊసెత్తడం లేదు. తాజాగా కొమరాడ పంచాయతీలో నిధులు పక్కదారి పట్టినట్లు రెండుసార్లు ఫిర్యాదులు వచ్చినా.. ఇంతవరకు విచారణ చేపట్టకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కలెక్టర్‌ ఆదేశించినా..

కొమరాడ పంచాయతీకి గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వం నుంచి రూ.35 లక్షలు మంజూరైతే ఇందులో అత్యధిక నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఇటీవల పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌కు ఫిర్యాదులు కూడా వచ్చాయి. తక్షణమే విచారణ చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించినా.. సంబంధిత అధికారుల్లో చలనం లేదు. తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. దీంతో ఈనెల 11న మళ్లీ ఆ ప్రాంతవాసులు కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఇంతవరకు విచారణ ప్రారంభించకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు స్పందిం చడంలేదని సంబంఽఽధిత శాఖాధికారులను ప్రశ్నించారు. తక్షణమే చర్యలు తీసుకుని తమకు నివేదిక అందించాలని ఆదేశించారు. అయితే నిధుల దుర్వినియోగంపై ఎప్పుడు విచారణ ప్రారంభిస్తారు? బాధ్యులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారన్నది! జిల్లా పంచాయతీ అధికారులకే తెలియాలి.

జాప్యం ఎందుకో?

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదులు వచ్చే వరకు పంచాయతీలో నిధులు ఏమవు తున్నాయో తెలియని పరిస్థితుల్లో పంచాయతీ అధికారులు ఉండడం దారుణం. వాస్తవంగా పంచాయతీలకు మంజూరవుతున్న నిధులు, వాటితో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవోతో పాటు ఈవోపీఆర్‌డీ, డీఎల్‌పీవో, డీపీవో తదితరులు పర్యవేక్షించాలి. అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. పూర్తిగా పర్యవేక్షణ కొరవడడంతో నిధులు పక్కదారి పడుతు న్నాయనే వ్యాఖ్యలు లేకపోలేదు. ఇదిలా ఉండగా కలెక్టర్‌ ఆదేశించినా నిధుల దుర్వినియోగంపై ఇంకా జిల్లా పంచాయతీ అధికారి విచారణ ప్రారంభించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఈ విషయంలో జాప్యమెందుకో? అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై డీపీవో కొండలరావును వివరణ కోరగా.. ‘కలెక్టర్‌ ఆదేశాలతో కొమరాడ పంచాయతీలో నిధుల వినియోగంపై విచారణ చేపడతాం. నిధులు పక్కదారి పట్టినట్టు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.

రికవరీ ఎప్పుడు?

గతంలో పార్వతీపురం మండలం పెదమరికి పంచాయతీలో సుమారు రూ.30 లక్షలు పైబడి నిధులు పక్కదారి పట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అప్పట్లో పనిచేసిన ఎంపీడీవో విచారణ నిర్వహించి సంబంధిత గ్రామ కార్యదర్శిని సస్పెండ్‌ చేశారు. పక్కదారి పట్టిన నిధులు రికవరీలో మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇక సీతానగరం మండలం జోగింపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై కొన్నాళ్ల తర్వాత.. విచారణ జరిపారు. అప్పట్లో పనిచేసిన గ్రామ కార్యదర్శులను ఇటీవల సస్పెండ్‌ చేశారు. ఈ విధంగా గ్రామ కార్యదర్శులపై చర్యలు తీసుకోవడమే తప్ప నిధులు రికవరీ ఊసెత్తడం లేదు. కార్యదర్శులపై చర్యలు తీసుకుని.. తూతూ మంత్రంగా చెక్‌ పవర్‌ రద్దు చేయడం తప్ప రివరీ ఈ విషయంలో జిల్లా పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Aug 12 , 2025 | 11:14 PM