From now on.. ఇప్పటి నుంచే..
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:01 AM
From now on.. సంక్రాంతి పండుగకు ఆర్టీసీ సన్నద్ధమౌతున్నది. ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. దూర ప్రాంతాలకు సైతం బస్సులు నడపడం ద్వారా విజయనగరం, ఎస్.కోట డిపోలకు ఎక్కువ ఆదాయం వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు ఆన్‌లైన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటి నుంచే..
సంక్రాంతి కోసం ఆర్టీసీ ప్రణాళిక
దూర ప్రాంతాలకు ఆన్‌లైన్ రిజర్వేషన్
జనవరి 8 నుంచి ప్రత్యేక బస్సులు
విజయనగరం రింగురోడ్డు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగకు ఆర్టీసీ సన్నద్ధమౌతున్నది. ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. దూర ప్రాంతాలకు సైతం బస్సులు నడపడం ద్వారా విజయనగరం, ఎస్.కోట డిపోలకు ఎక్కువ ఆదాయం వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు ఆన్‌లైన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. విజయనగరం, ఎస్.కోట డిపోల నుంచి విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, విజయవాడ, తెలంగాణలోని హైదరాబాదు ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు నిర్ణయించారు. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 8 నుంచి 14 వరకూ, అదే విధంగా సంక్రాంతి పండుగ అనంతరం జనవరి 16 నుంచి 20 వరకూ నడుస్తాయి. దాదాపు 283 బస్సులు నడపనున్నారు. ఈ బస్సులకు సంబంధించి టిక్కెట్ల ధరలను కూడా నిర్ణయించారు. విజయనగరం నుంచి విజయవాడ సూపర్ లగ్జరీ 780-00 అలా్ట్ర డీలక్స్ 750-00 అలాగే రాజమహేంద్రవరానికి సూపర్‌లగ్జరీ 490-00, ఆలా్ట్ర డీలక్స్ 470-00, భీమవరం సూపర్ లగ్జరీ 650-00, ఆలా్ట్ర డీలక్స్ 610-00, కాకినాడకు సూపర్ లగ్జరీ 420-00, ఆలా్ట్ర డీలక్స్ 405-00, రావులపాలెం సూపర్ లగ్జరీ 530-00, ఆలా్ట్ర డీలక్స్ 505-00 కాగా సాధారణ బస్సుల్లో సాధారణ టిక్కెట్ ధరలనే సంక్రాంతి పండుగలో కూడా అమలులో ఉంటాయి.
- సంక్రాంతి పండుగకు సంబంధించి గత ఏడాది జనవరి 8 నుంచి 14 వరకూ, అదే విధంగా జనవరి 16 నుంచి 20 మధ్య నడిపిన బస్సుల ద్వారా విజయనగరం, ఎస్‌కోట డిపోలకు రూ.61 లక్షల ఆదాయం రాగా ఈ ఏడాది ఆక్సుపెన్సీ రేటు తగ్గే అవకాశం ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది బస్సుల సంఖ్య పెంచినప్పటికీ స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. ఈ ప్రభావం ఆదాయం, ఆక్సుపెన్సీ రేటుపై పడనుందన్న ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
283 బస్సులు నడపనున్నాం
జి.వరలక్ష్మీ, ప్రజారవాణాధికారి
సంక్రాంతి పండుగకు విజయనగరం జిల్లాకు వచ్చేవారు, అదే విధంగా జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి కోసం 283 బస్సులు నడపనున్నాం. ఈ బస్సులు జనవరి 8 నుంచి 14 వరకూ అదే విధంగా తిరుగు ప్రయాణం వారి కోసం జనవరి 16 నుంచి 20 వరకూ తిరుగుతాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌లతో పాటు, ఆన్‌లైన్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చాం. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎపీఎస్‌ఆర్టీసీఆన్‌లైన్.ఇన్‌లో ముందుగా రిజర్వేషన్ చేసుకోవచ్చు. సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీయే మేలు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.
-------------