Share News

Free travel on RTC buses ఆర్టీసీ బస్సులో ఇక ఉచిత ప్రయాణం

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:20 AM

Free travel on RTC buses మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు దాదాపు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. ఈ పథకానికి స్త్రీశక్తి పేరును ఖరారు చేసింది. ఈ నెల 15 నుంచి పథకాన్ని అమలు చేయనుంది.

Free travel on RTC buses  ఆర్టీసీ బస్సులో   ఇక ఉచిత ప్రయాణం

ఆర్టీసీ బస్సులో

ఇక ఉచిత ప్రయాణం

మహిళలకు కూటమి ప్రభుత్వ వరం

రేపటి నుంచి అమలుకు సన్నద్ధం

స్ర్తీశక్తి పేరుతో శ్రీకారం

ఏర్పాట్లు పూర్తిచేసిన ఆర్‌టీసీ అధికారులు

విజయనగరం రింగురోడ్డు/ నెల్లిమర్ల/ రాజాం, ఆగస్టు 13(ఆంరఽధజ్యోతి):

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు దాదాపు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. ఈ పథకానికి స్త్రీశక్తి పేరును ఖరారు చేసింది. ఈ నెల 15 నుంచి పథకాన్ని అమలు చేయనుంది. మహిళలు ప్రతిరోజు ఎంత మంది ప్రయాణించే ఆవకాశం ఉందన్న విషయంపై ఇప్పటికే అధికారులు సర్వే చేసుకుని ఓ అంచనాకు వచ్చారు. జిల్లాలో 23.44 లక్షల మంది జనాభా ఉండగా, వారిలో మహిళలు 11.74 లక్షల మంది ఉన్నారు. వీరిలో కనీసం 25వేల మంది ప్రతి రోజు ఉచిత బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిసింది.

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఐదు రకాల బస్సులను ప్రభుత్వం ఎంపిక చేసింది. పల్లె వెలుగు, అల్ర్టా పల్లెవెలుగు, సిటి ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలను అనుమతించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. జిల్లా పరిఽధి దాటి రాష్ట్రంలోని ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణ పరిధిని రాష్ట్ర మంతటికీ వర్తింపజేయడంతో సుదూర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు, ప్రముఖ దేవాలయాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు టిక్కెట్‌ తీయకుండా చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో బస్సులకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది.

గుర్తింపు కార్డు తప్పనిసరి

ఉచిత బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలు తమ గుర్తింపు కార్డులను తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ప్రధానంగా వారు ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ఆధార్‌ కార్డు గాని, రేషన్‌ కార్డు గాని, ఓటర్‌ గుర్తింపు కార్డు గాని తీసుకువెళ్తే సరిపోతుంది. ఉచిత బస్సుల్లో ప్రయాణించే మహిళలకు కండక్టర్‌ స్ర్తీ శక్తి పేరుతో ఉన్న 0 ధర టిక్కెట్‌ను ఇస్తారు. తద్వారా ప్రయాణించే వారి సంఖ్య, దూరం వివరాలను ఆర్టీసీ ప్రతిరోజూ ప్రభుత్వానికి నివేదిస్తుంది. అనంతరం ఆ టిక్కెట్‌ ధర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి చేరుతుంది. జిల్లాలో విజయనగరంతో పాటు శృంగవరపుకోటలో ఆర్‌టీసీ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 60 రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. రోజుకు 12 వేల మంది వరకు మహిళలు ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉచిత ప్రయాణానికి అవకాశం ఇవ్వడంతో ఆ సంఖ్య సుమారు 25 వేలకు చేరవచ్చని అంచనాకు వచ్చారు.

సదుపాయాలపై దృష్టి

స్త్రీశక్తి పేరుతో ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం చెప్పడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నది సుస్పష్టం. ఇందుకు సంబంధించి కాంప్లెక్స్‌ల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్‌టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. తాగు నీటి సదుపాయాల పెంపు, ఫ్యాన్‌ల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఈ పథకంతో ఆర్‌టీసీ కాంప్లెక్స్‌లు ఆఽధునికీకరణకు, సదుపాయాల మెరుగుకు అవకాశం ఏర్పడిందని చెప్పవచ్చు.

కండక్టర్‌లకు బాడీవార్న్‌ కెమెరాలు

బస్సుల్లో రద్దీ ఎక్కువ ఉండేటప్పుడు ఘర్షణలకు, గొడవలకు ఆస్కారం ఉండడంతో కండక్టర్‌లకు బాడీవార్న్‌ కెమెరాలు ఇస్తున్నారు. వాటిని దుస్తులకు అమర్చుకోవచ్చు. బస్సుల్లో సీసీ కెమెరాలు కూడా పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఆ బస్సుల్లో ఉచితం ఉండదు

ప్రీమియర్‌ సర్వీసులుగా ఉండే నాన్‌స్టాప్‌, ఇంటర్‌ స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌లు, లగ్జరీ, సూపర్‌ లగ్జరీ, ఇంద్ర ఏసీ బస్సులకు ఈ పథకం వర్తించదు. అలాగే ఘాట్‌ రోడ్లలో ప్రయాణించే బస్సుల్లో సైతం ఉచిత ప్రయాణం ఉండదు. ఈ మార్గాల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తే బస్సుల్లో ప్రయాణికులు పెరుగుతారు. దీంతో ఆటంకాలు, ప్రమాదాలు జరగవచ్చునని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం సర్వీసుల్లో 73 శాతం బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించనున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఏర్పాట్లు చేశాం

మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశాం. ఉచిత ప్రయాణాన్ని మహిళలు వినియోగించుకోవాలి. ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణం చేయవచ్చు. బస్సుల్లో భద్రతకు సీసీ కెమెరాలు అమర్చుతాం. ఆర్టీసీ బస్టాండ్లలో వసతులు సైతం మెరుగుపరుస్తాం.

- వరలక్ష్మి, ప్రజా రవాణా అధికారి, విజయనగరం

ఆనందంగా ఉంది

చాలా ఆనందంగా ఉంది. సీఎం చంద్రబాబు మహిళా పక్షపాతి అనిపించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తుండడం శుభ పరిణామం. రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మహిళలకు పెద్ద పీట వేస్తూ సంక్షేమ పథకాలు అమలుచేయడం బాగుంది.

ఎల్‌.ధనలక్ష్మి, రాజాం

శుభ పరిణామం..

ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం అవకాశం కల్పించడం శుభ పరిణామం. ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాదిరిగానే ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తుండడం చాలా బాగుంది. సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలుచేయడం ఆహ్వానించదగ్గ పరిణామం.

చోడిశెట్టి పద్మ, రాజాం

జిల్లాలో మంత్రితో ప్రారంభోత్సవం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి రంగం సిద్దమైంది. విజయవాడలోని గాంధీ బస్‌స్టేషన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ఆగస్టు 15న సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే సమయానికి అన్ని జిల్లాల్లో మంత్రులు ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. విజయనగరంలో ఆర్టీసీ బస్‌కాంప్లెక్స్‌లో జరిగే ప్రారంభోత్సవానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు, ప్రజాప్రతి నిధులు భాగస్వాములు కానున్నారు. మహిళలకు సంబంధించిన కార్యక్రమం నేపథ్యంలో ఎక్కువ మంది మహిళలు ఈకార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని, ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి, ఆర్టీసీ అధికారులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు ఆర్టీసీ జిల్లా ప్రజారవాణాధికారి జి.వరలక్ష్మీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

----------------

Updated Date - Aug 14 , 2025 | 12:20 AM