free Travel.. ఉచిత ప్రయాణం..మహిళల్లో ఆనందోత్సాహం
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:26 PM
free Travel.. Joy Among Women ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై జిల్లా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్ర్తీశక్తి పథకంతో నెలవారీ ఖర్చులు ఆదా అవుతాయని చెబుతు న్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లు కిటకిటలాడాయి.
‘ స్ర్తీశక్తి ’పథకంపై హర్షాతిరేకాలు
పార్వతీపురం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై జిల్లా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్ర్తీశక్తి పథకంతో నెలవారీ ఖర్చులు ఆదా అవుతాయని చెబుతు న్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లు కిటకిటలాడాయి. మహిళా ప్రయాణికులతో సందడిగా మారాయి. పార్వతీపురం, పాలకొండ, సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ల నుంచి విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు రద్దీగా కనిపించాయి. బస్సుల్లో ఆధార్ లేదా మరేదైనా గుర్తింపు కార్డు చూపించిన వారికి కండక్టర్లు జీరో ఫేర్ టికెట్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సీఎం చంద్రబాబుకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. కూరగాయలు అమ్ముకుని జీవనం సాగించే మహిళలు, ఉద్యోగినులు, తీర్థయాత్రలకు వెళ్లే వారికి స్ర్తీశక్తి పథకం ఎంతగానో దోహదపడుతుందని పలువురు తెలియజేశారు. వాస్తవంగా పార్వతీపురం నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే రానుపోనూ కనీసం రూ.400 చెల్లించాల్సి వచ్చేది. దీంతో శుభకార్యాలు, ఆసుపత్రులు, ఇతర పనుల మీద విశాఖ వెళ్లే మహిళలు పార్వతీపురం నుంచి పాసింజర్ రైలును ఆశ్రయించేవారు. అయితే కూటమి ప్రభుత్వం స్ర్తీ శక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో జిల్లా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.