Share News

ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం

ABN , Publish Date - Dec 25 , 2025 | 10:40 PM

ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ఇప్పటికే ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అమలు చేస్తోంది.

ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
ఆర్టీసీ లోగో

- జిల్లాలో 1198 మందికి లబ్ధి

పాలకొండ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ఇప్పటికే ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అమలు చేస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకు వేసి దివ్యాంగులకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని సంకల్పిం చింది. ఈ విషయాన్ని ఇటీవల అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ప్రకటించారు. ప్రస్తుతం దివ్యాంగులు 50 శాతం టికెట్‌ రాయితీతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. త్వరలో ఎలాంటి రాయితీ లేకుండా ఉచితంగా ప్రయాణించే అవకాశం కలగనుంది. జిల్లాలో 1198 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం ప్రస్తుతం నాలుగు రకాలైన పాస్‌లను దివ్యాంగులకు జారీ చేస్తుంది. వీటిలో 40 శాతం శారీరక వైకల్యం ఉన్న వారికి, వంద శాతం వినికిడి లోపం ఉన్నవారికి, వందశాతం అంధత్వం ఉన్నవారికి, 69 శాతం కంటే తక్కువ ఐక్యూతో మానసిక వైకల్యం ఉన్నవారికి ఆర్టీసీ పాస్‌లు ఇస్తుంది. పాలకొండ డిపో పరిధిలో 224 మంది దివ్యాంగులు, పార్వతీపురం డిపోలో 465మంది, సాలూరు డిపోలో 509మంది దివ్యాంగులు పాస్‌ల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. వీరంతా టికెట్‌పై 50 శాతం సబ్సిడీ పొందుతున్నారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే వారికి మరింత ఆర్థిక స్వావలంబన కలగనుంది. దీనిపై జిల్లా ప్రజా రవాణాధికారి వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. ‘దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు ఉన్నతాధికారుల నుంచి సమాచారం ఉంది. జిల్లాలోని దివ్యాంగుల పాస్‌ల వివరాలను ఉన్నతాధికారులు అడిగారు. దీనికి సంబంధించి సమగ్ర సమాచారం అందించాం.’ అని తెలిపారు.

Updated Date - Dec 25 , 2025 | 10:40 PM