Secretariats నాలుగు రోజులపాటు సచివాలయాల్లో సేవలకు అంతరాయం
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:37 PM
Four-Day Disruption in Services at Secretariats గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నాలుగు రోజుల పాటు పలు సేవలకు అంతరాయం కలగనుంది. సచివాలయశాఖ నిర్వహిస్తున్న ఏపీ సేవ పోర్టల్‌ను మైక్రోసాఫ్ట్ అజార్ క్లోడ్ నుంచి రాష్ట్ర డేటా సెంటర్‌కు తరలిస్తుండడమే ఇందుకు కారణం.
ప్రకటించిన ఉన్నతాధికారులు
గరుగుబిల్లి, జూన్ 7(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నాలుగు రోజుల పాటు పలు సేవలకు అంతరాయం కలగనుంది. సచివాలయశాఖ నిర్వహిస్తున్న ఏపీ సేవ పోర్టల్‌ను మైక్రోసాఫ్ట్ అజార్ క్లోడ్ నుంచి రాష్ట్ర డేటా సెంటర్‌కు తరలిస్తుండడమే ఇందుకు కారణం. ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు వివిధ సేవలను నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర జీఎస్‌డబ్ల్యూఎస్ డైరెక్టర్ ఎం.శివప్రసాద్ ప్రకటించారు. సేవలు నిలుపుదల కారణంగా ఆదాయ, సమగ్ర, నివాస స్థల, వృద్ధాప్య, వివాహ ధ్రువీకరణ పత్రాలు, మ్యూటేషన్లు, రేషన్, రైస్ కార్డులు, రెవెన్యూ వాటర్ ట్యాక్స్, పట్టణ పరిపాలనకు సంబంధించి మొత్తం పది సేవలకు నాలుగు రోజుల పాటు అంతరాయం కలగనుంది. వాటిని మినహాయించి మిగిలినవి మీసేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు. దీనిపై డ్వామా పీడీ కె.రామచంద్రరావును వివరణ కోరగా.. డైరెక్టర్ నుంచి ఆదేశాలు అందిన మాట వాస్తవమేనని తెలిపారు. జిల్లాలోని సచివాలయాలు, ఎంపీడీవోలకు సమాచారం అందించామన్నారు.