నలుగురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్టు
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:28 AM
గజపతినగరం పట్టణంలో గతనెల 21న జాతీయరహదారి, మెంటాడ రోడ్డులో 8 షాపుల్లో చోరీ కేసుల్లో అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసినట్టు బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి తెలిపారు.
గజపతినగరం, మార్చి12 (ఆంధ్రజ్యోతి): గజపతినగరం పట్టణంలో గతనెల 21న జాతీయరహదారి, మెంటాడ రోడ్డులో 8 షాపుల్లో చోరీ కేసుల్లో అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసినట్టు బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొత్తవలస పట్టణానికి చెందిన గులిపల్లి కిరణ్‌కుమార్, శ్రీను నాయక్, రావుల్ రమణ, విశాఖ పట్నం జిల్లా అల్లిపురం ప్రాంతానికి చెందిన షేక్‌బాషాను అంతరాష్ట్ర దొంగలుగా గుర్తించామన్నారు. తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర, తమిళనాడులో చోరీలకు పాల్పడేవారన్నారు. మన రాష్ట్రంలో తుని నెల్లూరు, విజయనగరం వన్‌టౌన్, బొండపల్లి, గజపతి నగరం, ఎస్.కోట ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటంతో వీరిపై 9 కేసులు నమోదై ఉన్నాయన్నారు. గజపతినగరంలో గతంలో జరిగిన ఎలక్రికల్ షాపులో చోరీ కేసులో నిందితులను పట్టుకుని విచారించడంతో వారిచ్చిన సమాచారం మేరకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. గజపతి నగరం రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకున్నా మన్నారు. వారి నుంచి రూ.88,620 నగదు, ఒక ల్యాప్‌టాప్, 9 స్మార్ట్ ఫోన్‌లు, 3 గోల్ట్ కలర్ వాచీలను రికవరీ చేశామన్నారు. ఇంకా మరో ఇద్దరు నిందితులు వెంకటేశ్ శివగౌడ్, లంబు రవి పరారీలో ఉన్నారన్నారు. వారినీ త్వరలో పట్టు కుంటామన్నారు. సమావేశంలో సీఐ రమణ, ఎస్‌ఐ లక్ష్మణరావు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న డీఎస్పీ భవ్యరెడ్డి