Share News

వారికి వినాయక ఉత్సవమే సంక్రాంతి పండుగ

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:04 AM

మండలంలోని కొండపేటకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామస్థులు వినాయక ఉత్సవాలను సంక్రాంతి పండుగలా నిర్వహిస్తుంటారు.

వారికి వినాయక ఉత్సవమే సంక్రాంతి పండుగ
పూజలు నిర్వహిస్తున్న గ్రామస్థులు, పూజలందుకుంటున్న వినాయకుడు

- ప్రతి ఏటా గణేష్‌ నవరాత్రి వేడుకలు

- బ్రిటీషు కాలం నుంచి నిర్వహణ

- కొండపేటలో రేపు ముగియనున్న 91వ వార్షికోత్సవం

నెల్లిమర్ల, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండపేటకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామస్థులు వినాయక ఉత్సవాలను సంక్రాంతి పండుగలా నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా గణేష్‌ నవరాత్రులను కన్నుల పండుగగా జరుపుకొంటారు. 1934లో బ్రిటీష్‌ కాలంలో ప్రారంభమైన ఈ ఆనవాయితీ నేటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 91వ వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయి. మొదట్నుంచి ఒక్క అడుగు విగ్రహాన్నే ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. 2020 కొవిడ్‌ సమయంలో కూడా ఉత్సవాలు ఆగలేదు. ప్రతి ఏటా తొమ్మిది నుంచి 25 రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. స్వామివారి సన్నిధిలో ప్రతిరోజూ భజనలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ ఏడాది 25 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఇటీవల చంద్రగ్రహణం సంభవించిన రోజున శాస్త్రీయ పద్ధతిలో సంప్రోక్షణ జరిపించి ఉత్సవాలు కొనసాగిస్తున్నారు. ఆదివారం నిమజ్జనం కార్యక్రమానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం రోజున గ్రామస్థులు తమ బంధువులను పిలుచుకుంటారు. నేల వేషాలు, సాము గరిడీలు, మంగళ వాయిద్యాలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక చంపావతి నదిలో ఘనంగా నిమజ్జనం చేస్తారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్థులంతా ఐక్యంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది స్థానిక టీడీపీ నాయకులు ఆల్తి శ్రీనివాసరావు, నడిపేన నారాయణరావు ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు నిర్వహిస్తున్నారు.

మాకు పెద్ద పండుగ

మా తాతదండ్రుల నుంచి వినాయక ఉత్సవాలను పెద్ద పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చుట్టాలు, బంధువులను పిలిచి సంక్రాంతిలా నిర్వహించుకుంటాం. గత 90 ఏళ్ల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 91వ సంవత్సరం.

-ఆల్తి శ్రీనివాసరావు, గ్రామస్థుడు

Updated Date - Sep 13 , 2025 | 12:04 AM