Share News

For the establishment of industries..! పరిశ్రమల స్థాపనకే..!

ABN , Publish Date - Jul 25 , 2025 | 12:13 AM

For the establishment of industries..! ఇన్‌చార్జి మంత్రి, కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్‌ ప్రకటనలు చూస్తే ప్రభుత్వం జిందాల్‌ భూముల్లో పరిశ్రమల స్థాపనకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిశ్రమకు భూములిచ్చిన రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకొనే పక్రియను వేగవంతం చేసింది.

For the establishment of industries..! పరిశ్రమల స్థాపనకే..!
కేఆర్‌సీసీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ మురళికి బుధవారం వినతిపత్రం అందిస్తున్న నిర్వాసితులు

పరిశ్రమల స్థాపనకే..!

జిందాల్‌ భూముల్లో ప్రభుత్వ మొగ్గు

అర్హులైన భూనిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తామని భరోసా

జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం నుంచి ఇండస్ట్రీయల్‌ పార్కుగా మార్పు

2023 డిసెంబర్‌ 30న ఉత్తర్వులు జారీ చేసిన వైసీపీ ప్రభుత్వం

కొనసాగించే దిశగా సంకేతాలు ఇస్తున్న కూటమి ప్రభుత్వం

జిందాల్‌ మోసం చేసిందంటున్న ఎమ్మెల్సీ రఘురాజు

- శృంగవరపుకోట మండలంలో జిందాల్‌ అల్యూమినియం కంపెనీ కోసం 834.66 ఎకరాల అసైన్మెంట్‌ భూమి, 151.04 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. 180.73 ఎకరాల జిరాయితీ భూమితో కలపి 1166.43 ఎకరాలను 2008 ఫిబ్రవరి 28న అందించారు. అసైన్‌ మెంటు భూమికి నష్టపరిహారంగా ఎకరాకు రూ.2,00500, ప్రభుత్వ భూమిపై ఉన్న అర్హత కలిగిన ఆక్రమణదారులకు ఎకరాకు రూ.75,000 చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. డి.పట్టాలు కలిగిన 375 మంది అసైన్మెంట్‌దారుల్లో 332 మందికి నష్టపరిహారంతో పాటు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ మంజూరు చేశారు. పక్కా ఇళ్లు, వ్యవసాయ బోర్లకు జరిగిన నష్టానికి పరిహారం అందించారు. వీరిలోనూ ఇంకా అర్హులుంటే కలెక్టర్‌కు దరఖాస్తు చేయండి. పరిశీలించి పరిహారం అందిస్తారు. 2023 అక్టోబర్‌ 31న జెఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్‌ నుంచి ఎమ్‌ఎస్‌ జెఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీయల్‌ పార్కు లిమిటెడ్‌గా మారుస్తూ ఇండస్ట్రీయల్‌ అండ్‌ కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

- వారం రోజుల కిందట జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటన

- జిందాల్‌ భూ నిర్వాసితులు ఇచ్చిన దరఖాస్తులపై అర్హత నిర్ధారించాలని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. నిర్వాసితులు కొన్ని కలెక్టర్‌కు అందించారు. కొన్ని నేను రైతుల దగ్గర తీసుకున్నాను. పరిశీలించిన తరువాత అర్హత కలిగిన వారి వివరాలను సమగ్రంగా కలెక్టర్‌కు అందిస్తాను. కొందరు భూములను తిరిగి ఇమ్మని అడుగుతున్నారు. మరికొందరు పరిహారం ఇవ్వాలని అడుగుతున్నారు. ఈరెండు అభిప్రాయాలకు అనుగుణంగా కలెక్టర్‌కు నివేదిక అందిస్తాను.

- రెండు రోజుల కిందట ఎస్‌.కోట తహసీల్దార్‌ కార్యాలయంలో విలేకర్లకు వెల్లడించిన కెఆర్‌సీసీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ మురళి

శృంగవరపుకోట, జూలై 24(ఆంధ్రజ్యోతి):

ఇన్‌చార్జి మంత్రి, కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్‌ ప్రకటనలు చూస్తే ప్రభుత్వం జిందాల్‌ భూముల్లో పరిశ్రమల స్థాపనకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిశ్రమకు భూములిచ్చిన రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకొనే పక్రియను వేగవంతం చేసింది. అర్హత కలిగిన జిందాల్‌ భూ నిర్వాసితులకు అన్ని రకాల నష్టపరిహారాలను అందించాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే కలెక్టర్‌ అంబేడ్కర్‌ శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణతో కలిసి మాట్లాడుతూ జిందాల్‌ భూ నిర్వాసితులకు ఇంకా అందాల్సిన నష్టపరిహారంపై స్పష్టత ఇచ్చారు. కేవలం 15 మంది భూనిర్వాసితులకు మాత్రమే నష్టపరిహారం పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. వారి పేర్లను నిర్వాసిత గ్రామాలతో సహా బయటపెట్టారు. అంతటితో ఆగకుండా జిందాల్‌ భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కేఆర్‌సీసీ (కోనేరు రంగారావు సిఫార్స్‌ల కమిటీ) ప్రత్యేక డిపూటీ కలెక్టర్‌ మురళీని విచారణ అఽధికారిగా నియమించారు.

డిప్యూటీ కలెక్టర్‌ రాక

బుధవారం శృంగవరపుకోట తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన ఈయన భూనిర్వాసిత రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సీపీఎం నాయకుడు చల్లా జగన్‌ ఆధ్వర్వంలో భూ నిర్వాసిత రైతులు ఇక్కడకు వచ్చారు. జిందాల్‌ పరిశ్రమ యాజమాన్యానికి ఇచ్చిన తమ భూములు తిరిగి ఇచ్చేయాలన్న డిమాండ్‌తో ఆందోళన చేశారు. ఇదే విషయాన్ని పలువురు నిర్వాసిత రైతులు కెఆర్‌సీసీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ మురళీ వద్ద ప్రస్తావించారు. అయితే విచారణకు వచ్చిన ఇతనికి కేవలం 11 మంది రైతులు మాత్రమే వినతులు అందించారు. కలెక్టర్‌ వద్దకు చేరిన దరఖాస్తుల వివరాలను స్థానిక రెవెన్యూ అధికారులు చెప్పలేకపోతున్నారు. అక్కడ కూడా పదుల సంఖ్యలోనే నష్టపరిహారం కోసం దరఖాస్తులు అందించారని మాత్రమే చెప్పగలుగుతున్నారు. అయితే ప్రభుత్వం జిందాల్‌ భూసేకరణ సమయంలో తీసుకున్న భూములతో పాటు అందిన పరిహారం గురించి మంత్రులు, అధికారులతో చెప్పిస్తోంది. వీరి మాటల ప్రకారం 2008 ఫిబ్రవరి 18న 834.66 ఎకరాల అసైన్‌మెంటు భూమి, 151.04 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు 180.73 ఎకరాల జిరాయితీ భూమి కలిపి 1166.43 ఎకరాలు జిందాల్‌ అల్యూమినియం కంపెనీకి అందించారు.

పరిహారం ఇలా..

అసైన్‌మెంట్‌ భూమికి ఎకరాకు రూ.2,00,500, ప్రభుత్వ భూమిపై ఉన్న అర్హత కలిగిన ఆక్రమణదారులకు ఎకరా వద్ద రూ.75,000 చొప్పున పరిహరం ఇచ్చారు. డి.పట్టా కలిగిన 375 మంది అసైన్‌మెంటుదారుల్లో 332 మందికి నష్ట పరిహారంతో పాటు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ మంజూరు చేశారు. 54 పక్కా ఇళ్లకు సంబంధించి నష్టపరిహారం మంజూరు చేయగా ఒకరు ఇంకా ఇల్లు ఖాళీ చేయలేదు. 53 వ్యవసాయ బోర్లుకు గాను 28 మందికి నష్టపరిహారం చెల్లించారు. మిగిలిన 23 మంది యజమానులను గుర్తిస్తున్నారు.

ఎం/ఎస్‌ జెఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీయల్‌ పార్కు లిమిటెడ్‌గా మార్పు

శృంగవరపుకోట మండల పరిధిలోని కిల్తంపాలెం, మూలబొడ్డవర, చినఖండేపల్లి, చీడిపాలెం, ముషిడిపల్లి గ్రామాల్లో జిందాల్‌ అల్యూమినియం లిమిటెడ్‌ కోసం 18 సంవత్సరాల క్రితం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం భూములను సేకరించింది. ఈ భూముల్లో ఇంతవరకు ఎటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేయలేదు. అయితే 2023 అక్టోబర్‌ 31న జెఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్‌ నుంచి ఎం/ఎస్‌ జెఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీయల్‌ పార్కుగా ఇండస్ట్రీయల్‌, కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ మార్పుచేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీన్నే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొనసాగించే దిశగా అడుగులు వేస్తోంది.

- కొత్తవలస మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. అయితే ఉత్తరాంధ్రలో ఎక్కడా లేనంత భూమి జిందాల్‌ యాజమాన్యం వద్ద ఉంది. ఈ భూమిలో పరిశ్రమలను నెలకొల్పితే వేలల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది ప్రభుత్వ ఆలోచన. పైగా జిందాల్‌ యాజమాన్యం ఇప్పటికే ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. కాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్‌, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్‌ఆర్‌కె ప్రసాద్‌లు పరిశ్రమలకు అనుకూలంగా ఆందోళన చేస్తున్న వారికి మద్దతు ఇచ్చారు. ఇటీవల జిందాల్‌ భూముల్లో పరిశ్రమలు నిర్మించాలని కొంతమంది యువకులు చేపట్టిన పోరాటాన్ని టీడీపీ యువజన నాయకుడు ముక్కా రామకృష్ణ ముందుండి నడిపించారు.

ఉచిత షేర్ల హామీతోనూ యాజమాన్యం మోసం

‘పది రూపాయలున్న షేరు విలువ మూడు సంవత్సరాల్లో రూ.100 అవుతుంది. భూమిని కోల్పోయిన రైతులకు స్వచ్ఛందంగా షేర్లు ఇస్తున్నాం. పరిశ్రమ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం. కంపెనీ అభివృద్ధి చెందితే షేర్‌ విలువ పెరుగుతుంది. దేశంలో తొలిసారి జెఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ భూమి కోల్పోయిన వారికి ఇచ్చే ఆరుదైన అవకాశం ఇది.’ అని జిందాల్‌ యాజమాన్యం నమ్మబలికిందని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు విమర్శిస్తున్నారు. అప్పట్లో జిందాల్‌ యాజమాన్యం కలెక్టర్‌కు సమర్పించిన లేఖను బయటపెట్టారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Updated Date - Jul 25 , 2025 | 12:13 AM