Share News

Housing Construction ఇళ్ల నిర్మాణంపై దృష్టి

ABN , Publish Date - Jun 01 , 2025 | 11:37 PM

Focus on Housing Construction జిల్లాలో పీవీటీజీ గిరిజనులకు జన్‌మన్‌ పథకంలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేకాధికారులు దృష్టిసారించారు. పనుల వేగవంతానికి చర్యలు చేపడుతున్నారు.

  Housing Construction  ఇళ్ల నిర్మాణంపై దృష్టి
ఖరాసవలసలో గృహ నిర్మాణంపై ఆరా తీస్తున్న హౌసింగ్‌ అధికారి

  • గిరిజనులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

  • గడువులోగా పనులు పూర్తిచేసేందుకు చర్యలు

సాలూరు రూరల్‌, జూన్‌1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పీవీటీజీ గిరిజనులకు జన్‌మన్‌ పథకంలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేకాధికారులు దృష్టిసారించారు. పనుల వేగవంతానికి చర్యలు చేపడుతున్నారు. ప్రిమిటెవ్‌ ట్రైబల్‌ గ్రూప్‌(పీవీటీజీ)నకు చెందిన సవర, గదబ తదితర గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం జన్‌మన్‌ ప్రవేశపెట్టింది. ఈ పథకంలో వారికి ఇళ్లు, విద్య, వైద్యం, కమ్యూనికేషన్‌, తాగునీరు, రోడ్లు తదితర సౌకర్యాలకు నిధులు అందించనున్నారు. కాగా జిల్లాలో సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పరిధిలో పీవీటీజీలకు చెందిన సవర, గదబ తదితర 7,280 మందికి ఇళ్లు లేవని గుర్తించారు. వారిలో 5,853 మందికి ఇళ్ల నిర్మాణాల కోసం రూ.137.60 కోట్లు మంజూరు చేశారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 3,323 మందికి, సీతంపేట ఐటీడీఏ పరిధిలో 2,530 మంది ఇళ్లు మంజూరు చేయగా.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.39 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే వివిధ కారణాలతో నిర్మాణాలు జోరందుకోకపోవడంపై మండలాల ప్రత్యేకాధికారులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. జన్‌మన్‌ ఇళ్ల నిర్మాణాలు ఎంత వరకు వచ్చాయి. ఇప్పటి వరకు ఎంత బిల్లు చెల్లించారు. ఎవరైనా అనర్హులున్నారా? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. సాలూరు మండలంలో తోణాం, కందులపథం, మరిపిల్లి, నెలిపర్తి, కొత్తవలస, ఖరాసవలస, పెదపథం పంచాయతీల్లో 141 మందికి జన్‌మన్‌ కింద ఇళ్లు మంజూరయ్యాయి. వారిలో 60 మంది వివిధ కారణాలతో నిర్మాణాలను తిరస్క రించారు. మిగిలిన 81 మందిలో ఇప్పటి వరకు 50 ఇళ్ల నిర్మాణాలు వివిధ స్థాయిలో ఉన్నాయి. జన్‌మన్‌ ఇళ్ల పనులను ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయించడానికి అధికారులు కార్యాచరణ చేస్తున్నారు.

గడువులోగా పూర్తి చేయిస్తాం

జన్‌మన్‌ ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయిస్తాం. మండలంలో ఇప్పటికే 50 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మిగిలిన వాటి పనులు పూర్తయ్యేలా కృషి చేస్తాం.

- గొల్లపల్లి పార్వతి, ఎంపీడీవో, సాలూరు

Updated Date - Jun 01 , 2025 | 11:37 PM