Share News

చదువుపైనే ధ్యాస Focus on education

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:55 PM

Focus on education కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ ప్రక్షాళనకు నడుంబిగించింది. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థుల చదువుకు అగ్ర ప్రాధాన్యం ఇస్తూ వారిని అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. గత ఏడాది జూన్‌ 12న ప్రభుత్వం కొలువుదీరాక అప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమైనా.. ఎటువంటి అవరోధాలు లేకుండా విద్యాకానుక కిట్ల పంపిణీని పూర్తిచేసింది.

చదువుపైనే ధ్యాస Focus on education

చదువుపైనే ధ్యాస

సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం

విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం

ఒకే రోజు తల్లికి వందనం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, విద్యామిత్ర కిట్ల పంపిణీ

నాడు విలీనం చేసిన పాఠశాలలు వెనక్కి

ప్రభుత్వ బడికి చలో.. చలో అంటున్న తల్లిదండ్రులు

విజయనగరం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి):

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ ప్రక్షాళనకు నడుంబిగించింది. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థుల చదువుకు అగ్ర ప్రాధాన్యం ఇస్తూ వారిని అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. గత ఏడాది జూన్‌ 12న ప్రభుత్వం కొలువుదీరాక అప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమైనా.. ఎటువంటి అవరోధాలు లేకుండా విద్యాకానుక కిట్ల పంపిణీని పూర్తిచేసింది. బ్యాగులపై అప్పటి సీఎం చిత్రాలను మాత్రమే తొలగించింది. ఇక ఈ విద్యాసంవత్సరంలో మాత్రం సమూల మార్పులు తీసుకొచ్చింది. తల్లికి వందనం పథకం అమలు, మధ్యాహ్న భోజన పథకంలో ప్రాంతాలకు అనుగుణంగా మెనూ, సన్నబియ్యంతో ఆహారం, విద్యార్థులకు రవాణా ఖర్చులు, షైనింగ్‌ స్టార్స్‌ పేరిట నగదు ప్రోత్సాహకాలు, 11 రకాల వస్తువులతో రూ.2500 విలువ చేసే సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యామిత్ర కిట్లు పంపిణీ వంటివి అందించింది.

పాఠశాలలకు పూర్వ వైభవం

గత వైసీపీ సర్కారు నిర్వాకం పుణ్యమా అని పాఠశాలలు తగ్గిపోయాయి. ఈ ప్రభుత్వం మళ్లీ వాటిని పునరుద్ధరిస్తోంది. జిల్లాలో ఉన్న 1717 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఐదు విభాగాలు చేశారు. ప్రతి పంచాయతీలో పాఠశాలలు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో 156 ఉన్నత పాఠశాలల్లో విలీనమైన 3,4,5 తరగతులను తిరిగి వెనక్కి రప్పించారు. అంగన్‌వాడీతో పాటు 1,2 తరగతుల నిర్వహణకు సంబంధించి ఫౌండేషన్‌ స్కూళ్లు 213, బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లు 905, ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు 285, ప్రాథమికోన్నత పాఠశాలలు 54, ఉన్నత పాఠశాలలు 259ని కొనసాగించారు. గుణాత్మకమైన విద్య, ఉత్తమ విద్యాబోధన అందించేందుకు వీలుగా కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో సంస్కరణలు తీసుకొచ్చింది. మరోవైపు విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ ముందుగానే ప్రకటించింది. పాఠశాలల పనిదినాలు, సెలవులపైనా స్పష్టత ఇచ్చింది.

విద్యామిత్ర కిట్ల పంపిణీ..

ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం నాడే డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యామిత్ర కింద కిట్లను అందించింది. విద్యామిత్ర కిట్లలో పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు ఏకరూప దుస్తులు, బ్యాగ్‌, బెల్ట్‌, షూ, నిఘంటువు అందించారు. 1 నుంచి పదో తరగతి విద్యార్థులకు ఏకరూప దుస్తులు మూడు జతలు అందించారు. 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు నోట్‌బుక్‌లు, 1 నుంచి 5వ తరగతి వరకూ వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. బూట్లు ఒక జత, సాక్సులు రెండు జతలు అందించారు. ఒకటో తరగతి వారికి పిక్టోరియల్‌ డిక్షనరీ, 6వ తరగతి వారికి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ అందించారు. చేరికలు బట్టి రెండోసారి అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సన్నబియ్యంతో పౌష్టికాహారం

జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో ఆహారం పెడుతున్నారు. గతంలో పౌరసరఫరాలశాఖ నుంచి డీలర్లకు.. అక్కడి నుంచి విద్యాసంస్థలకు అందించేవారు. ఇక నుంచి నేరుగా గోదాముల నుంచి విద్యాసంస్థలకు తరలించాలని నిర్ణయించారు. 25 కిలోల బియ్యాన్ని క్యూఆర్‌ కోడ్‌తో కుట్టిన ట్యాగ్‌తో సరఫరా చేస్తారు. హెచ్‌ఎంలు స్కాన్‌ చేస్తే ఓటీపీ వస్తుంది. అప్పుడే ఈ బియ్యం విడుదలకు అనుమతిస్తుంది. దీంతో సన్నబియ్యం పక్కదారి పట్టే అవకాశమే ఉండదు. ఇప్పటివరకూ విద్యాసంస్థలకు అందించే ముందు బియ్యంతో పాటు 50 కిలోల సంచుల పుణ్యమా అని బియ్యంలో పురుగులు చేరేవి. దీంతో అన్నంలో నాణ్యత లోపించేది. ఈసారి పోర్టుఫైడ్‌ అయిన సన్న బియ్యం అందించేందుకు నిర్ణయించారు. అది కూడా 50 కిలోల్లో కాకుండా 25 కిలోల లెక్కన అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో బియ్యం పురుగు పట్టకుండా బాగా ఉంటాయని భావిస్తున్నారు.

విద్యార్థులకు ప్రోత్సాహకాలు..

పది, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్‌ స్టార్స్‌ పేరిట రూ.20 వేల రూపాయల నగదు ప్రోత్సహకాలు అందించడంతో పాటు వారిని సన్మానించారు. జిల్లా వ్యాప్తంగా పదో తరగతికి సంబంధించి 162 మంది, ఇంటర్‌కు సంబంధించి 36 మందిని ఎంపిక చేసి అవార్డుతో పాటు నగదు పారితోషికం అందించారు. మొత్తం రూ.39.6 లక్షలను షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులకు కేటాయించారు.

పిల్లలందరికీ తల్లికి వందనం..

విద్యాసంవత్సరం ప్రారంభం నాడే తల్లికి వందనం అమలుచేసి ప్రభుత్వం చిత్తశుద్దిని నిరూపించుకుంది. ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13 వేలు జమ చేయగా పాఠశాల అభివృద్ధికి సంబంధించి విద్యార్థి తరుపున రూ.2 వేలు కలెక్టర్‌ ఖాతాలోకి జమ చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే సాయం అందేది. కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ వర్తింపజేసింది. జిల్లాలో 1,94,921 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.253.39 కోట్లు జమయ్యాయి. అటు కలెక్టర్‌ ఖాతాకు రూ.38.98 కోట్లు జమ చేశారు.

పిల్లల చదువుకే ఖర్చు చేస్తా

గర్భాపు స్వర్ణ విధ్యార్థినుల తల్లి, చిత్రకోట, బొడ్డవలస, బొబ్బిలి మండలం

ముగ్గురు ఆడపిల్లల తల్లిని. రోజుకూలి పని చేస్తుంటాను. పిల్లలకు ఉన్నత విద్య అందించాలని నిర్ణయించుకున్నాను. మా ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం కింద రూ.39 వేలు నా ఖాతాలో జమయ్యాయి. ఈ డబ్బులను వారి చదువుకే ఖర్చు చేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నా లాంటి తల్లులందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను.

----------------------------

Updated Date - Jun 17 , 2025 | 11:55 PM