తాగునీటి వనరులపై దృష్టి
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:31 AM
మొంథా తుఫాన్ నేపథ్యంలో రోగాలు ప్రబలకుండా జిల్లా వ్యాప్తంగా రక్షిత తాగునీటి పథకాల ట్యాంకులను శుభ్రపరచాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు.
మంత్రి, కలెక్టర్ ఆదేశాలతో కదిలిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు
విజయనగరం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ నేపథ్యంలో రోగాలు ప్రబలకుండా జిల్లా వ్యాప్తంగా రక్షిత తాగునీటి పథకాల ట్యాంకులను శుభ్రపరచాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. వారి ఆదేశాలతో గ్రామీ ణ నీటి సరఫరా విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉన్నతాధికారులు ప్రక్షాళన చర్యలకు శ్రీకారం చుట్టారు. తక్షణమే అన్ని రక్షిత తాగునీటి పథకాలు, ట్యాంకర్లలో తగిన మోతాదులో క్లోరినేషన్ చేయాలని నిర్ణయించారు. నదీతీర ప్రాంతా ల్లో ఉన్న గ్రామాలకు నీటిని అందించే ఇన్‌ఫిల్టర్ బావుల వద్ద వరదనీరు చేరింది. అలాంటి చోట్ల నీటిని వాటర్ ట్యాంకులకు లిఫ్ట్ చేయొద్దని అధికారులకు సూచించారు.
విజయనగరం జిల్లా పరిధిలోని 777 గ్రామాలు ఉండగా.. వీటిలో నివసించే ప్రజలకు నీటి సరఫరా కోసం 150 బావులు, 30 రక్షిత తాగునీటి పథకాలు, 15,800 చేతిబోర్లు ఉన్నాయి. అయితే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న 7 రక్షిత తాగునీటి బావులు, పథకాలు ప్రస్తుతం వరదనీటిలో ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న 150 గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఈ 150 గ్రామాల ప్రజలకు ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన తాగునీరును అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయా పథకాల పరిధిలో తాగునీరు సరఫరా అయ్యే పైపులైన్లలో మట్టి, బురదను తొలగించే కార్యక్రమం జరుగుతుంది. అదే విధంగా రక్షిత తాగునీటి పథకాలు, బావులు, బోర్ల వద్ద ప్రత్యేకంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో చేరిన బురదను తొలగించి, బీచింగ్ పౌడర్ వేయడంతో పాటు ఆయా ట్యాంకులను కూడా యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి వారం రోజులు పట్టే అవకాశం ఉంది. గోస్తనీ నది పరివాహక ప్రాంతం పరిధిలో దాదాపు మూడు గ్రామాల్లో కూడా ఇదే విధమైన చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా బురదనీరు రాకుండా తగిన చర్యలు చేపడుతున్నారు.
కాచి చల్లార్చిన నీరు తాగాలి
తుఫాన్ కారణంగా జిల్లాలోని ప్రజలు కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఎక్కడైతే, బావులు, తాగునీటి పథకాలు తదితర వాటి వద్ద బురద వచ్చిందో.. ఆ ప్రాంత ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని మంత్రి శ్రీనివాస్, కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. వారి ఆదేశానుసారం జిల్లాలోని 150 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. మరో వైపు బావులు, రక్షిత తాగునీటి పథకాలు, చేతిబోర్లు వద్ద శుభ్రం చేసి, క్లోరినేషన్ చేస్తున్నాం. ఈ ప్రక్రియను వీలైనంత వేగంగా ముగిస్తాం.
- కవిత, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ, విజయనగరం