Focus on arrears బకాయిలపైనే దృష్టి
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:52 PM
Focus on arrears జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) మొండి బకాయిలపై దృష్టిపెట్టింది. వాటి వసూళ్లకు ప్రత్యేక బృందాలను నియమించింది. 8 బ్రాంచిల్లో రూ.49 కోట్ల బాకీలు ఉన్నట్లు తేల్చింది. ఈ మేరకు 667 మందికి నోటీసులు కూడా జారీ చేసింది. బకాయిల వసూలుకు రెండు ప్రత్యేక బృందాలను నియమిస్తూ డీసీసీబీ సీఈవో చిప్పాడ ఉమామహేశ్వరరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
బకాయిలపైనే దృష్టి
డీసీసీబీలో మొండి బకాయిల వసూళ్లకు ప్రత్యేక బృందాలు
8 బ్రాంచిల్లో రూ.49 కోట్ల బాకీలు
667 మందికి నోటీసులు జారీ
విజయనగరం టౌన్, సెప్టెంబర్ 2(ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) మొండి బకాయిలపై దృష్టిపెట్టింది. వాటి వసూళ్లకు ప్రత్యేక బృందాలను నియమించింది. 8 బ్రాంచిల్లో రూ.49 కోట్ల బాకీలు ఉన్నట్లు తేల్చింది. ఈ మేరకు 667 మందికి నోటీసులు కూడా జారీ చేసింది. బకాయిల వసూలుకు రెండు ప్రత్యేక బృందాలను నియమిస్తూ డీసీసీబీ సీఈవో చిప్పాడ ఉమామహేశ్వరరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో ఉన్న 24 బ్రాంచిల్లో అత్యధికంగా బకాయిలు ఉన్న 8 బ్రాంచిల్లో నెల్లిమర్ల, గుర్ల, గజపతినగరం, పూసపాటిరేగ, తెర్లాం, సాలూరు, సీతానగరం, గరివిడి ఉన్నాయి. ఈ బ్రాంచుల్లో 667 మంది రూ.49.03 కోట్లు బకాయి పడినట్టు గుర్తించారు. వెంటనే చెల్లించాలని బ్యాంకు అధికారులు ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా వారు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో బకాయిల వసూళ్లలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. బకాయిదారుల్లో అత్యధికమంది రాజకీయ నాయకులు, వారి అనుయాయులు ఉండడంతో ఇన్నాళ్లూ బ్యాంకు అధికారులు కూడా మిన్నకుండిపోయారు. అయితే బకాయిదారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున హెచ్చరించడంతో బ్యాంకు అధికారులు రంగంలోకి దిగారు. పారుబాకీల జాబితాలో ఉన్నవారిని గుర్తించి వారి ఆస్తులను స్వాధీనం చేసేందుకు వీలుగా జప్తు నోటీసులను జారీ చేశారు. న్యాయపరమైన చర్యలకు కూడా ఉపక్రమించారు. ఇప్పటికీ బకాయిలను చెల్లించేందుకు ముందుకురాకుంటే వారి భూములను వేలం వేసేందుకూ నిర్ణయించారు. దీనిలో భాగంగా ఆయా గ్రామాల్లో దండోరా వేయించి ప్రభుత్వ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో బకాయిదారుల జాబితా అంటిస్తారు. ఈ ప్రక్రియ శరవేగంగా చేపట్టేందుకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అరసాడ శ్రీనివాసనాయుడు, పిల్లా రామ్మోహన్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ బృందంలో సభ్యులుగా ఎం.సంతోష్‌కుమార్, బి.సంహగిరి ఉన్నారు.
- నెల్లిమర్ల బ్యాంచి పరిధిలో 64 మంది రూ.ఆరు కోట్లు, గజపతినగరం బ్యాంచి పరిధిలో 116 మంది రూ.పది కోట్లు, పూసపాటిరేగ బ్రాంచి పరిధిలో 93 మంది రూ.8.50 కోట్లు, గరివిడి బ్రాంచి పరిధిలో 34 మంది రూ.3.12కోట్లు, సీతానగరం బ్రాంచి పరిధిలో 9 మంది రూ.42లక్షల పారుబాకీలు చెల్లించాల్సి ఉంది. అలాగే తెర్లాం బ్రాంచిలో 127 మంది రూ.8.50 కోట్లు, గుర్ల బ్రాంచిలో 145 మంది రూ.11 కోట్లు, సాలూరు బ్రాంచి పరిధిలో 89 మంది రూ.7.50 కోట్లు బకాయిలను చెల్లించాల్సి ఉంది.
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం
ఎనిమిది బ్రాంచిల్లో పేరుకుపోయిన పారుబాకీలను వసూలు చేసేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు బకాయిదారులకు జప్తు నోటీసులు జారీ చేసినా పట్టించుకోవడం లేదు. బకాయిదారుల భూములను వేలం వేసేందుకు న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నాం.
- ఉమామహేశ్వరరావు, సీఈవో, డీసీసీబీ
రైటప్స్: 2వీజెడ్‌ఎం1: