focas on sadabainamas గ్రామ పురోణీలపై ఆరా
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:05 AM
focas on sadabainamas గ్రామాల్లో జరుగుతున్న భూముల రీసర్వేలో అధికారులకు అందుతున్న వినతుల్లో ఎక్కువగా గ్రామ పురోణీలకు(సాదా బైనామాలు) సంబంధించినవే ఉన్నాయి. వీటిని పరిష్కరిస్తే గ్రామాల్లో భూ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మండల అధికారుల్లో గ్రామ పురోణీలపై ఇటీవల అనేక చర్చలు జరిగాయి.
గ్రామ పురోణీలపై ఆరా
మండలాల వారీగా వివరాలు సేకరించిన రెవెన్యూ అధికారులు
తహసీల్దార్ల నుంచి సమాచారం సేకరించిన ఉన్నతాధికారులు
క్రమబద్ధీకరించే ఆలోచనలో ప్రభుత్వం
విజయనగరం కలెక్టరేట్, మార్చి 23(ఆంధ్రజ్యోతి):
గ్రామాల్లో జరుగుతున్న భూముల రీసర్వేలో అధికారులకు అందుతున్న వినతుల్లో ఎక్కువగా గ్రామ పురోణీలకు(సాదా బైనామాలు) సంబంధించినవే ఉన్నాయి. వీటిని పరిష్కరిస్తే గ్రామాల్లో భూ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మండల అధికారుల్లో గ్రామ పురోణీలపై ఇటీవల అనేక చర్చలు జరిగాయి. మండల అధికారుల నుంచి జిల్లా అధికారులకు నివేదికలు వెళ్లాయి. వాటిపై స్పందించిన భూపరిపాలన అధికారులు మండలాల వారీగా ఉన్న గ్రామ పురోణీలపై ఆరా తీశారు. అవి ఏ విధంగా ఉన్నాయి. వివాదాలు చోటుచేసుకోకుండా వాటిని ఎలా పరిష్కరించుకోగలం.. ఎంత సంఖ్యలో ఉన్నాయి... తదితర వివరాలను ఉన్నతాధికారులు అడిగారు. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కొద్ది రోజుల్లో జీవో ఇచ్చే ఆవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రెవెన్యూ అధికారి చెప్పారు.
ఇరవై సంవత్సరాల క్రితం గ్రామాల్లో చాలా మంది రైతులు తోటి రైతుల భూములను కొనుగోలు చేసేటప్పుడు రిజిస్ర్టేషన్ చేసుకోకుండా తెల్లకాగితం, స్టాంప్ పేపర్ రాసుకునేవారు. వాటినే గ్రామపురోణీ(సాదాబైనామాలు)లు అంటున్నాం. సంవత్సరాల తరబడి భూ లావాదేవీలకు పురోణీలే ఆధారంగా ఉండేవి. ఎలాంటి సమస్య ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబాల విభజన, వెబ్‌ల్యాండ్ రాక తర్వాత భూముల రికార్డుల నవీకరణ కావడంతో ఆయా పురోణీల్లో ఉన్న భూముల వివరాలు కూడా ఆన్‌లైన్ చేయాల్సి వస్తోంది. చేయకుంటే భూముల అమ్మకం చేసేటప్పుడు సరిహద్దు తగాదాలు, భూ హక్కు సమస్యలు వస్తున్నాయి. సంవత్సరాలుగా పరిష్కారం కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వీటిపై ఈ ప్రభుత్వం దృష్టిసారించింది. పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.
2010లో కూడా సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అప్పటి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అప్పట్లో కొద్ది రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో చాలా మంది వినియోగించుకో లేకపోయారు. 2014 నుంచి 2019 వరకూ ఉన్న టీడీపీ ప్రభుత్వంలోనూ వీటి క్రమబద్ధీరణకు జీవో ఇచ్చింది. గ్రామాల్లో మెట్టు ఐదు ఎకరాలు, పల్లం 2.50 ఎకరాలలోపు ఉన్న భూములకు స్టాంప్ డ్యూటీ లేకుండా క్రమబద్ధీకరణ చేసేలా మార్గదర్శకాలు జారీ చేసింది. అర్హులైన రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అప్పటిలో 1,09,695 దరఖాస్తులు వచ్చాయి. అంతా సిద్ధం చేసిన తరుణంలో 2019లో సాధారణ ఎన్నికలు రావడం.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. గత ప్రభుత్వం భూముల రీసర్వేపై ప్రత్యేక దృష్టి పెట్టింది కానీ సర్వేలో కొత్త సమస్యలను తెరపై తెచ్చిన గ్రామ పురోణిలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కొత్త ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారంలో భాగంగా సాధాబైనామాల క్రమబద్ధీకరణ దిశగా అడుగులు వేస్తోంది. నాలుగు రోజులు క్రితం మండలాల పరిధిలో గ్రామ పురోణీలపై తహసీల్దార్ల నుంచి కలెక్టరేట్ అధికారులు ఆరా తీశారు. వీటిపై ఎలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు సేకరించారు. ఆ నివేదికను రాష్ట్ర సీసీఎల్‌ఏకు పంపించారు. వీటిపై కొద్ది రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే విషయమై జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి వద్ద ప్రస్తావించగా సాదాబైనామాలపై తహసీల్దార్ల నుంచి వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించామని వెల్లడించారు.
----------------------