Share News

‘ప్రజాదర్బార్‌’కు వినతుల వెల్లువ

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:29 AM

గంట్యాడ మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. వివిధ సమస్యల పై మొత్తం 152 వినతులు అందాయి.

‘ప్రజాదర్బార్‌’కు వినతుల వెల్లువ
వినతులు స్వీకరిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

  • నరవలో 52 మంది అనర్హులకు ఇళ్లు

  • అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

  • సమస్యలు విన్నవించిన ప్రజలు

  • వినతులు స్వీకరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

గంట్యాడ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): గంట్యాడ మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. వివిధ సమస్యల పై మొత్తం 152 వినతులు అందాయి. ఇందులో అధికంగా పింఛన్లు మంజూరు చేయాలంటూ అర్జీదారులు కోరారు. వినతులు స్వీకరించిన మంత్రి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పీరుబండి హైమావతి, తహసీల్దార్‌ నీలకంఠరేశ్వరెడ్డి, ఎంపీడీవో రమణమూర్తి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు భాస్కర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అనర్హులకు ఇళ్లు

నరవ గ్రామంలో గత వైసీపీ హయాంలో 52 మంది అనర్హులకు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నరవ సన్యాసిరావు గ్రీవెన్స్‌ లో మంత్రికి విన్న వించారు. గ్రామంలో ఇళ్లు కలిగి.. ఇంటి పన్ను చెల్లిస్తున్న వారికి గత వైసీపీ హయాంలో మళ్లీ మంజూరు చేశారని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవా లని గతంలో అధికారులకు ఫిర్యా దు చేసినా పట్టించు కోలేదన్నారు. వెంటనే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

పోలవరం కాలువ డిజైన్‌ మార్చండి

పోలవరం కుడి కాలువ డిజైన్‌ మార్పు చేయాలంటూ కొండతామారాపల్లి, కొత్తవెలగాడ గ్రామాలకు చెందిన రైతులు కోరారు. ప్రస్తుతం ఉన్న కాలువ డిజైన్‌ మార్పు చేయకపోవడంతో తమ పంట పొలాలకు చాలా ఇబ్బంది ఎదురవుతోందని అన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

తాగునీటికి ఇబ్బందులు

మండలంలోని కొండతామారాపల్లి గ్రామంలో తాగునీటి సమస్య ఉందని... దీనిని పరిష్కరించాలని స్థానికుడు ఎరుకునాయుడు వినతిపత్రం అందించారు. ప్రధానంగా రెండు వీధులుకు తాగునీరు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని విన్నవించారు.

విద్యుత్‌ సమస్య పరిష్కరించండి

బోనంగి గ్రామంలో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందని పీఏసీఎస్‌ చైర్మన్‌ గోపిశెట్టి శంకరరావు, జి.రమేష్‌ తదితరులు విన్నవించారు. గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే జెడ్పీ పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని కోరారు.

Updated Date - Dec 16 , 2025 | 12:29 AM