Share News

fishermen facing problems తీరమెక్కడో.. గమ్యమేమిటో

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:35 AM

fishermen facing problems పాపం మత్స్యకారులు... కనుచూపు మేరలో ఎవరూ కనిపించని చోట నడి సముద్రంలో రోజుల కొద్దీ వేట సాగిస్తుంటారు. మత్స్యసంపద లభ్యమయ్యే వరకూ అలుపెరగకుండా పనిచేస్తారు. ఆ జీవన పోరాటంలో అనేక అవరోధాల్ని ఎదుర్కొంటుంటారు. బోటు బోల్తా కొట్టి ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. అకస్మాత్తుగా తుఫాన్లు వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నెట్టుకు రావాల్సిందే. ఆ సమయంలో సిగ్నల్స్‌ పనిచేయక ఎటు వెళ్లాలో తెలియదు. ఇదే పరిస్థితిలో తాజాగా ఎనిమిది మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్‌ జలాల వైపు వెళ్లిపోయి అక్కడి కోస్టుగార్డుకు చిక్కారు. వారిని క్షేమంగా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

fishermen facing problems తీరమెక్కడో.. గమ్యమేమిటో

తీరమెక్కడో.. గమ్యమేమిటో

నడిసంద్రంలో మత్స్యకారులకు కష్టాలు

అకస్మాత్తుగా తుఫాన్‌లు వస్తే అంతే

ఎటు వెళ్లాలో దిక్కుతోచని వైనం

ఇదే పరిస్థితిలో తాజాగా బంగ్లాదేశ్‌కు చిక్కిన 8 మంది

వారి రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు

క్షేమంగా తీసుకువస్తామన్న మంత్రి కొండపల్లి

విదేశాంగ శాఖతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

బంగ్లాదేశ్‌ ప్రభుత్వంతో చర్చలు

త్వరలోనే స్వదేశానికి చేరే అవకాశం

పాపం మత్స్యకారులు... కనుచూపు మేరలో ఎవరూ కనిపించని చోట నడి సముద్రంలో రోజుల కొద్దీ వేట సాగిస్తుంటారు. మత్స్యసంపద లభ్యమయ్యే వరకూ అలుపెరగకుండా పనిచేస్తారు. ఆ జీవన పోరాటంలో అనేక అవరోధాల్ని ఎదుర్కొంటుంటారు. బోటు బోల్తా కొట్టి ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. అకస్మాత్తుగా తుఫాన్లు వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నెట్టుకు రావాల్సిందే. ఆ సమయంలో సిగ్నల్స్‌ పనిచేయక ఎటు వెళ్లాలో తెలియదు. ఇదే పరిస్థితిలో తాజాగా ఎనిమిది మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్‌ జలాల వైపు వెళ్లిపోయి అక్కడి కోస్టుగార్డుకు చిక్కారు. వారిని క్షేమంగా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

విజయనగరం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో స్థానికంగా వేట గిట్టుబాటు గాక వందలాది మంది మత్స్యకారులు విశాఖ, చెన్నై, గుజరాత్‌, ముంబయి, కోల్‌కతా, పారాదీప్‌ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. కాంట్రాక్టర్ల వద్ద చేపల వేట పనికోసం చేరుతున్నారు. సముద్రంలోనే చాలా రోజుల పాటు ఉంటూ వేటాడుతుంటారు. ఆ సమయంలో ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటు న్నారు. వాతావరణం సహకరించక.. సిగ్నల్స్‌ అందక ఒక్కోసారి పొరపాటున విదేశీ జలాల్లోకి ప్రవేశించి అక్కడి కోస్టుగార్డులకు చిక్కుతున్నారు. రెండేళ్ల కిందట కూడా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జలాల్లో ప్రవేశించి చాలా రోజులు ఖైదీలుగా ఉండిపోయారు. ప్రస్తుతం జిల్లాకు చెందిన మత్స్యకారులు బంగ్లాదేశ్‌లో బందీలుగా ఉండడం తెలిసి మిగతా వారు ఆందోళన చెందుతున్నారు. భోగాపురం మండలం కొండ్రాజుపాలెం, పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన 8 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్‌ కోస్టుగార్డు అదుపులో ఉన్నారు. వీరంతా విశాఖలోని జాలరిపేటలో ఉంటూ వేటకు వెళ్తున్నారు. మూడువారాల వేటకుగాను విశాఖకు చెందిన సత్యనారాయణ బోటులో 13 రోజుల కిందట బయలుదేరారు. ఈ నెల 22న వేకువజాము సమయంలో బంగ్లాదేశ్‌ జలాల్లోకి ప్రవేశించడంతో అక్కడి కోస్టుగార్డులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ చెరలో కొండ్రాజుపాలేనికి చెందిన మరుపల్లి చిన్నప్పన్న, మరుపల్లి రమేష్‌, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్‌, సురపతి రాము, మైలపల్లి చిన్నఅప్పన్నతో పాటు పూసపాటిరేగ మండలం తిప్పలవసలకు చెందిన నక్కా రాము, వాసపల్లి సీతయ్య ఉన్నారు.

క్షేమంగా తీసుకొస్తాం

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న జిల్లాకు చెందిన మత్స్యకారులను క్షేమంగా ఇంటికి తీసుకొస్తాం. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఇండియన్‌ ఎంబసీ బంగ్లాదేశ్‌ ఎంబసీతో చర్చలు జరుపుతున్నారు. విదేవీ పర్యనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతున్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

కుటుంబాలకు పరామర్శ

పూసపాటిరేగ/ భోగాపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): తిప్పలవలస, కొండ్రాజుపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారుల కుటుంబాలు విశాఖలో నివాసం ఉండడంతో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నాగమాధవి గురువారం వారిని కలిసి ధైర్యం చెప్పారు. బంగ్లాదేశ్‌ నుంచి మత్స్యకారులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. ఆర్డీవో దాట్ల కీర్తి, తహసీల్దారు ఎన్‌వీ రమణ కూడా మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు కూడా మత్స్యకార కుటుంబాలతో మాట్లాడి ఓదార్చారు.

బంగ్లాదేశ్‌ జైల్లో..

విజయనగరం/ భోగాపురం, అక్టోబరు23(ఆంధ్రజ్యోతి): మత్స్యకారులు 8 మంది బంగ్లాదేశ్‌లోని మందాల పోలీస్‌ స్టేషన్‌లో క్షేమంగా ఉన్నట్లు కుటుంబీకులకు గురువారం సమాచారం అందింది. ఈ మేరకు బందీల్లో ఒకరైన మరుపల్లి చిన్నప్పన్న(డ్రైవర్‌) విశాఖలో ఉంటున్న బోటు వాచ్‌ మేన్‌ మారుపల్లి కిరణ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మెసేజ్‌ పెట్టాడు. అంతలోనే డిలీట్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కొండ్రాజుపాలెంకు చెందిన మత్స్యకార నాయకుడు సూరాడ చిన్నారావు ధ్రువీకరించారు.

భర్తను చూడాలని ఉంది

భోగాపురం, అక్టోబరు23(ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్‌ కోస్టుగార్డు అదుపులో ఉన్న వారిలో వివాహమై ఏడాది అయిన కొండ్రాజుపాలెంకు చెందిన సూరాడ అప్పలకొండ ఉన్నారు. ఈయన భార్య సూరాడ అనిత ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. భర్త చూడాలని ఉందని, త్వరగా ఇంటికి తీసుకురావాలని అధికారులు, నేతలను కోరింది.

మత్స్యకారులను రప్పించేందుకు చర్యలు

కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్‌ నేవీకి చిక్కిన జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్య్సకారులను స్వదేశానికి క్షేమంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుటోందని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి తెలిపారు. మత్స్యకారుల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోందని చెప్పారు. బంగ్లాదేశ్‌లో మత్స్యకారులపై చార్జిషీటు దాఖలైందని, అయితే ఢాకాలోని భారత హైకమిషనర్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయబృందం వారిని రక్షించేందుకు అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తోందని వివరించారు.

=========

Updated Date - Oct 24 , 2025 | 12:35 AM