ఎట్టకేలకు..
ABN , Publish Date - Dec 25 , 2025 | 10:38 PM
మండలంలోని వెంకంపేట రోడ్డు పనులకు మోక్షం కలిగింది. మూడు సంవత్సరాల తరువాత ఎట్టకేలకు పనులు పునఃప్రారంభమయ్యాయి.
- వెంకంపేట రోడ్డు పనులు పునఃప్రారంభం
- బిల్లులు చెల్లించకుండా గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం
- కూటమి ప్రభుత్వం రాకతో పనులకు మోక్షం
పార్వతీపురం రూరల్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి):మండలంలోని వెంకంపేట రోడ్డు పనులకు మోక్షం కలిగింది. మూడు సంవత్సరాల తరువాత ఎట్టకేలకు పనులు పునఃప్రారంభమయ్యాయి. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వెంకంపేట నుంచి ఏవోబీ(కోరాపుట్) వరకు పది కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టారు. రూ.17కోట్లతో పనులు చేపడతామని అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పారు. ఈ మేరకు మూడేళ్ల కిందట అట్టహాసంగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులను మధ్యలోనే నిలిపివేశారు. అప్పటి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాత రహదారి కూడా గోతులమయం కావడంతో వాహనాల రాకపోకలకు అనేక అవస్థలు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎమ్మెల్యే విజయచంద్ర ఈ సమస్యను రాష్ట్రస్థాయి ఆర్‌అండ్‌బీ అధికారులకు అనేకసార్లు విన్నవించారు. ఈ మేరకు కాంట్రాక్టర్‌కు పూర్తిస్థాయి బిల్లులు చెల్లించడంతో పనులు పునఃప్రారంభమయ్యాయి.