Share News

సీట్లు తక్కువ.. పోటీ ఎక్కువ.

ABN , Publish Date - May 24 , 2025 | 11:23 PM

ఉత్తమ బోధనతో పాటు మౌలిక వసతులు మెరుగ్గా ఉండడంతో గురుకుల కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు పోటీ పడుతున్నారు.

  సీట్లు తక్కువ.. పోటీ ఎక్కువ.
పార్వతీపురం: కౌన్సిలింగ్‌ సెంటర్‌ వద్ద విద్యార్థులు

- ఇదీ గురుకుల కళాశాలల్లో పరిస్థితి

- ప్రవేశాల కౌన్సిలింగ్‌కు పోటెత్తిన విద్యార్థులు

పార్వతీపురం/సీతంపేటరూరల్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): ఉత్తమ బోధనతో పాటు మౌలిక వసతులు మెరుగ్గా ఉండడంతో గురుకుల కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు పోటీ పడుతున్నారు. సీట్లు పొందేందుకు ఎగబడుతున్నారు. అయితే, ఒక సీటుకు ఇద్దరు ముగ్గురు పోటీపడుతున్నారు. దీనివల్ల చాలామందికి దొరకడం లేదు. దీంతో సీట్లు తక్కువ.. పోటీ ఎక్కువ అన్నచందంగా పరిస్థితి తయారైంది. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని గురుకుల కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశానికి శనివారం కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఐటీడీఏ పీవోలు అశుతోష్‌ శ్రీవాత్సవ, సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి కౌన్సిలింగ్‌ ప్రారంభించారు. పార్వతీపురం గురుకుల కళాశాల పరిధిలో 600 సీట్లు ఉండగా 1,150 మంది విద్యార్థులు కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. మెరిట్‌ ప్రాతిపదికన వారికి సీట్లు కేటాయించారు. కౌన్సిలింగ్‌కు హాజరైన కొంతమంది విద్యార్థులకు సీట్లు దక్కకపోవడంతో నిరాశతో వారంతా వెనుతిరిగారు. సీతంపేట బాలికల గురుకుల కళాశాలలో ఎంపీసీ 40, బైపీసీ, 40, హెచ్‌ఈసీ 40, ఏఅండ్‌టీ 20 మొత్తం 140 సీట్లు ఉన్నాయి. అయితే, సుమారు 450 మంది బాలికలు కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. మెరిట్‌ ప్రాతిపదికన 140 మందికి సీట్లు కేటాయించారు. మిగతా వారంతా ఇంటిబాట పట్టారు. అలాగే, సీతంపేట బాలుర గురుకుల కళాశాలలో ఎంపీసీ 40, బైపీసీ, 40, హెచ్‌ఈసీ 40, ఏఅండ్‌టీ 20, సీజీఏ 30 సీట్లు ఉన్నాయి. మొత్తం 170 సీట్లకు గాను 263 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 200 మంది కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. 162 మందికే సీట్లు కేటాయించారు. కొంతమంది విద్యార్థులకు సీట్లు దక్కకపోవడంతో ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీట్ల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - May 24 , 2025 | 11:23 PM