Fevers జ్వరాలు వదల్లే!
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:53 PM
Fevers Show No Sign of Relenting ఏజెన్సీ పంచాయతీల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికి ఒకరిద్దరు చొప్పున మంచం పట్టారు. సంబంధిత పీహెచ్‌సీ, సీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి ప్రధాన కారణం కలుషిత తాగునీరు, పారిశుధ్య లోపమేనని గిరిజనులు వాపోతున్నారు.
చినమేరంగి, జియ్యమ్మవలస ఆసుపత్రులు కిటకిట
వనజ గ్రామం నుంచి అత్యధికంగా వస్తున్న పీడితులు
వైద్య శిబిరం నిర్వహిస్తున్నా.. అదుపులోకి రాని పరిస్థితి
కలుషితనీరు, పారిశుధ్య లోపమే కారణమంటున్న గిరిజనులు
జియ్యమ్మవలస, ఆగస్టు5(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ పంచాయతీల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికి ఒకరిద్దరు చొప్పున మంచం పట్టారు. సంబంధిత పీహెచ్‌సీ, సీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి ప్రధాన కారణం కలుషిత తాగునీరు, పారిశుధ్య లోపమేనని గిరిజనులు వాపోతున్నారు. ప్రధానంగా అర్నాడ పంచాయతీలోని వనజ గ్రామంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ సుమారు 70 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. ఆ పంచాయతీలోని కొత్తవలస, కొత్తగూడతో కూడా రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలకు చెందిన 48 మంది చినమేరంగి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. జియ్యమ్మవలస పీహెచ్‌సీలోనూ రోజుకు పదుల సంఖ్యలో జ్వరపీడితులు తరలివస్తున్నారు. ఈ రెండు చోట్ల వైద్యాధికారులు, సిబ్బంది రోగులకు తగు చికిత్స అందిస్తూనే ఉన్నారు. జియ్యమ్మవలస పీహెచ్‌సీ వైద్యాధికారి పి.జగదీష్ ఆధ్వర్యంలో వనజ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. అయితే ఈ గ్రామంలో ఉన్న రక్షిత నీటి పథకం ట్యాంకు గత కొన్నేళ్లుగా శుభ్రం చేసిన దాఖాలు లేవని గ్రామస్థులు చెబుతున్నారు. అంతే కాకుండా గ్రామంలో కాలువలు చెత్తా చెదారాలతో నిండాయని, మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోందని వాపోతున్నారు. దీనివల్ల రాత్రి వేళల్లో దోమల బెడద అధికంగా ఉంటుందోని తెలియజేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
కలుషిత నీరే తాగుతున్నాం
మా గ్రామంలో రక్షిత నీటి పథకాన్ని శుభ్రం చేయడం లేదు. ట్యాంకు లోపల నాచు పట్టేసి, ఫంగస్ విపరీతంగా ఉంది. ఆ కలుషిత నీరే తాగాల్సి వస్తోంది.
- ఊలక నవీన్, జ్వర పీడితుడు, వనజ
===================================
సీజనల్ జ్వరాలే..
ఏజెన్సీ ప్రాంతాలతో పాటు వనజ గ్రామం నుంచి ఎక్కువగా జ్వర పీడితులు వస్తున్నారు. వీరికి తగు చికిత్స అందిస్తున్నాం. పూర్తిగా జ్వరం తగ్గిన తరువాత ఇంటికి పంపిస్తున్నాం. సీజనల్ జ్వరాలతో అత్యధికమంది సీహెచ్‌సీకి వస్తున్నారు.
- చైతన్య, ఆసుపత్రి సూపరింటెండెంట్, సీహెచ్‌సీ, చినమేరంగి