Festively సంబరంగా..
ABN , Publish Date - May 18 , 2025 | 11:30 PM
Festively సాలూరులో సంబరాలు మొదలయ్యాయి. గ్రామ దేవత శ్యామలాంబ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతరలో భాగంగా తొలిరోజు ఆదివారం పెదకోమటిపేటలో అమ్మవారి గద్దె వద్ద ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
తొలిరోజు ఘనంగా ఉయ్యాల కంబాల
అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు
భారీగా హాజరైన భక్తులు
నేడు తొలేళ్లు.. రేపు సిరిమానోత్సవం
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
సాలూరు, మే18(ఆంధ్రజ్యోతి): సాలూరులో సంబరాలు మొదలయ్యాయి. గ్రామ దేవత శ్యామలాంబ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతరలో భాగంగా తొలిరోజు ఆదివారం పెదకోమటిపేటలో అమ్మవారి గద్దె వద్ద ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణితోపాటు పట్టణ ప్రజలంతా భారీ ఎత్తున హాజరై ఘటాలకు పూజలు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు ఉత్సవ కమిటీతోపాటు పట్టణ ప్రముఖులు సంప్రదా యబద్ధంగా పాలజంగిడితో అనువంశిక ధర్మకర్త విక్రమచంద్ర సన్యాసిరాజు(యువరాజు)ను అమ్మవారి గద్దె వద్దకు తీసుకొచ్చారు. అనంతరం గ్రామ తలయారీ యజ్జల శంకరరావు, నాయుడువారి వంశానికి చెందిన అల్లు బెనర్జీ, పూజారి జన్ని ధనంజయరావు అమ్మవారి గద్దెలో ఘటాలకు అనువంశిక ధర్మకర్తతో విశేష పూజలు చేయించారు. యువరాజుతో పాటు మిగిలిన వారు ఊయలలో కూర్చొని ఊగారు. ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిం చారు. అనంతరం ఊరేగింపుగా పాలజంగిడి, అమ్మవారి ఘటాలు జన్నివారి ఇంటి గద్దెకు తిరుగుముఖం పట్టాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆర్‌పీ భంజ్‌దేవ్, పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.
మంత్రి పూజలు
పట్టణంలో జన్నివీధిలో ఉన్న అమ్మవారి ఘటాలను మంత్రి గుమ్మిడి సంధారాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలు, పండ్లు , పూజా సామగ్రిని సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తోటవీధిలో ఉన్న శ్యామలాంబ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ.. 15 ఏళ్ల తర్వాత జరుగుతున్న శ్యామలాంబ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారన్నారు. భక్తులు, పట్టణవాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్ , తాగునీటి, పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖల అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. పండుగ విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. అనంతరం బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తిరుపతిరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అక్కేన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
నేడు తొలేళ్లు
ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం తొలేళ్లు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక మూడో రోజు మంగళవారం సిరిమానోత్సవం నిర్వహించనున్నారు.
900 మందితో బందోబస్తు: ఎస్పీ
సాలూరు/బెలగాం:శ్యామలాంబ పండుగ ఏర్పాట్లను ఆదివారం ఎస్పీ మాధవరెడ్డి పర్యవేక్షించారు. పోలీసులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి సమస్య తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అమ్మవారి ఆలయం, సిరిమాను ఏర్పాట్లు, ఘటాలు తిరిగే ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. 900 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. రెండు షిఫ్టుల్లో వారిని 8 సెక్టార్లుగా విభజించినట్లు వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల రద్దీని డ్రోన్స్‌తో పర్యవేక్షిస్తామని తెలిపారు. ట్రాఫిక్ రద్దీని బట్టి డైవర్షన్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సిబ్బంది ఆదేశించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. సిరిమాను తిరిగే సమయంలో విద్యత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్య సదుపాయాల ఏర్పాట్లపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లో బారికేడ్లు పటిష్ఠంగా ఉండేలా చూడాలన్నారు. భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఈ పరిశీలనలో డీఎస్పీ రాంబాబు, ఆర్‌డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐ అప్పలనాయుడు, ఎస్బీ సీఐ రంగనాఽథం, సీఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.