Immersion Celebrations నిమజ్జనోత్సవాల సందడి
ABN , Publish Date - Aug 31 , 2025 | 10:54 PM
Festive Fervor of Immersion Celebrations జిల్లాలో అనేకచోట్ల ఆదివారం వినాయక నిమజ్జనోత్సవాల సందడి నెలకొంది. ఆనందోత్సాహాల నడుమ వేడుకలు నిర్వహించారు. మేళతాళాలు, డీజేలు, యువత కేరింతల మధ్య వినాయకుడి విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించి అనుపోత్సవం నిర్వహించారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
గరుగుబిల్లి/భామిని, ఆగస్టు31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అనేకచోట్ల ఆదివారం వినాయక నిమజ్జనోత్సవాల సందడి నెలకొంది. ఆనందోత్సాహాల నడుమ వేడుకలు నిర్వహించారు. మేళతాళాలు, డీజేలు, యువత కేరింతల మధ్య వినాయకుడి విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించి అనుపోత్సవం నిర్వహించారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గరుగుబిల్లి, భామిని మండలాల్లో వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు చేశారు. లడ్డూ ప్రసాదాలకు వేలం పాట నిర్వహించారు. ఉల్లిభద్ర, దత్తివలస, కొత్తూరుతో బత్తిలి తదితర గ్రామాల్లో పలువురు భక్తులు రూ.10 వేల నుంచి రూ. 30 వేల వరకు వేలం పాట నిర్వహించి లడ్డూను కైవసం చేసుకున్నారు. అంతకుముందు మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేశారు. అనంతరం వంశధార, నగావళి నదులు, సమీప చెరువుల్లో నిమజ్జనోత్సవాలు నిర్వహించారు. వాస్తవంగా తొమ్మిదో రోజున అధికంగా నిమజ్జనం చేస్తారు. కానీ సెప్టెంబరు 7న చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో చాలాచోట్ల ముందస్తుగా నిమజ్జనాలు చేపడుతున్నారు.