Share News

‘Vanamtho Utsavam’ సందడిగా ‘వనంతో ఉత్సవం’

ABN , Publish Date - Nov 01 , 2025 | 11:24 PM

Festive Fervor at ‘Vanamtho Utsavam’ జిల్లాలోని ఏజెన్సీ అందాలను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సీతంపేటలో వనంతో ఉత్సవం (పార్వతీపురంలో టూరిజం సీజన్‌ స్టార్ట్స్‌)కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

 ‘Vanamtho Utsavam’ సందడిగా ‘వనంతో ఉత్సవం’
కార్నివాల్‌ ర్యాలీలో విద్యార్థినులతో కలిసి థింసా నృత్యం చేస్తున్న మంత్రి, కలెక్టర్‌

  • పర్యాటక ప్రాంతాల అభివృద్దే ధ్యేయం

  • మంత్రి సంధ్యారాణి

సీతంపేట రూరల్‌, నవంబరు1(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీ అందాలను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సీతంపేటలో వనంతో ఉత్సవం (పార్వతీపురంలో టూరిజం సీజన్‌ స్టార్ట్స్‌)కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ముందుగా మెట్టుగూడ జలపాతం అందాలను తిలకించారు. ఫొటోసెషన్‌ను పరిశీలించి.. ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు. అనంతరం మెట్టుగూడ జలపాతం నుంచి సీతంపేట బస్టాండ్‌ వరకు ఏర్పాటు చేసిన బైక్‌ర్యాలీని ఆమెతో పాటు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు. జనజాతీయ గౌరవ దివస్‌ కార్యక్రమంలో భాగంగా సీతంపేటలో కార్నివాల్‌ ర్యాలీని పార్క్‌ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థినులతో కలిసి కలెక్టర్‌, మంత్రి థింసా నృత్యం చేశారు. ఆ తర్వాత వనంతో ఉత్సవంలో భాగంగా ఎన్‌టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన హాట్‌ఎయిర్‌ బెలూన్‌ ఈవెంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఎమ్మెల్యే జయకృష్ణతో కలిసి మంత్రి హాట్‌ఎయిర్‌ బెలూన్‌లో కాసేపు విహరించారు. పార్క్‌లో ఏర్పాటుచేసిన ఫుడ్‌ ఫెస్టివల్‌ను పరిశీలించి గిరిజన వంటకాలను రుచిచూశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఏజెన్సీలో పర్యాటక అందాలను అభివృద్థి చేస్తే తద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా పర్యాటక ప్రాంతా లను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. దీనికి అందరి సహకారం అవసరమన్నారు. అరకు పార్లమెంట్‌ పరిధిలో పర్యాటక సీజన్‌ ప్రారంభించినట్లు వెల్లడించారు. సీతంపేటలోని ఎన్‌టీఆర్‌ అడ్వంచర్‌పార్క్‌, మెట్టుగూడ జలపాతంతో పాటు మరికొన్ని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ చైర్మన్‌, కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ పింఛన్‌

సాలూరు, నవంబరు1(ఆంధ్రజ్యోతి): పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్‌ అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శనివారం పట్టణంలోని 17వ వార్డు అక్కేనవీధిలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను పలకరించి ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ప్రజా సంక్షే మానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పింఛన్ల ద్వారా పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ధ్యేయమని ఆమె చెప్పారు. మంత్రి వెంట టీడీపీ నాయకులు, అధికారులు ఉన్నారు. కాగా జిల్లా పరిధిలో తొలిరోజు 93 శాతం మేర ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. 350 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది నిబంధనల మేరకు లబ్ధిదారులకు పింఛన్‌ మొత్తాలను అందించారు. జిల్లాలో మొత్తం 1,39,863 పింఛన్లకు గాను ప్రభుత్వం రూ. 59.99 కోట్లు మంజూరు చేయగా.. శనివారం 1,29,436 మందికి రూ.55.19కోట్లు అందించారు.

Updated Date - Nov 01 , 2025 | 11:24 PM