Festive Celebrations సంబరాల సందడి
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:30 PM
Festive Celebrations కోటదుర్గమ్మ నామస్మరణతో పాలకొండ మార్మోగింది. శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పాలకొండ పట్టణంలోని పలు కాలనీలకు చెందిన వారు ఆదివారం ఘనంగా సామూహిక సంబరాలు నిర్వహించారు. ఘటాలు, ముర్రాటలతో ఊరేగింపుగా కోటదుర్గమ్మ ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
మహాచండీదేవిగా భక్తులకు దర్శనం
పాలకొండ, సెప్టెంబరు28(ఆంధ్రజ్యోతి): కోటదుర్గమ్మ నామస్మరణతో పాలకొండ మార్మోగింది. శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పాలకొండ పట్టణంలోని పలు కాలనీలకు చెందిన వారు ఆదివారం ఘనంగా సామూహిక సంబరాలు నిర్వహించారు. ఘటాలు, ముర్రాటలతో ఊరేగింపుగా కోటదుర్గమ్మ ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు రూ.వంద, రూ.30, ఉచిత క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. వలంటీర్ల ద్వారా భక్తులకు తాగునీరు, మజ్జిగ సరఫరా చేశారు. భవానీ మాలలు వేసిన వారి సహకారంతో నిర్వహించిన అన్నసమారాధనలో ఐదు వేలమంది పాల్గొన్నారు. సంబరాల్లో డప్పు వాయిద్యాలు, శక్తి వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డీఎస్పీ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ ప్రయోగమూర్తి ట్రాఫిక్ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు.
మహాచండీదేవి అలంకరణలో..
పాలకొండ కోట దుర్గమ్మ ఆదివారం మహాచండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. తొలుత ఆలయ ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీ ప్రసాదశర్మ ఆధ్వర్యంలో వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పరిసర ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలిరావడంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. అయితే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా.. ఈవో వీవీ సూర్యనారాయణ , ఆలయ సిబ్బంది, పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
108 రకాల ప్రసాదాలతో నైవేద్యం
కురుపాం: కురుపాం రావాడ కూడలి వద్ద ఉన్న కోట దుర్గమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు 108 రకాల పిండి వంటలను అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యం సమర్రిపంచారు. పరిసర ప్రాంతవాసులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
భామినిలో దొరల దసరా
భామిని, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): భామినిలో కీర్తిరాయి దొరల కుటుంబీకులు ఆదివారం అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహించారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఏటా దసరా ముందు ఆదివారం వారు పండుగ చేసుకోవడం ఆనవాయితీ. పర్లాకిమిడి రాజుల కాలం నుంచి వారు ఇదేవిధంగా కోటకొండ దుర్గమ్మను కొలుస్తున్నారు. దీనిలో భాగంగానే గిరిజన సంప్రదాయం ప్రకారం తొలుత గ్రామం నలుదిక్కుల్లో ఉన్న దేవతలను ముర్రాటలతో చల్లదనం చేశారు. వంశధార నదిలో ఆయుధాలను శుద్ధి చేసి ఇళ్ల వద్ద పూజించారు. మేళతాలాలు, డప్పు వాయిద్యాల నడుమ కీర్తిరాయి వంశీయుడైన నవీన్ చంద్రదొర.. రాజు వేషధారణలో గుర్రంపై ఊరేగింపుగా గ్రామస్థులతో కలిసి కోటకొండ దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారు కొలువైనట్లు భావించే వేపచెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడ అమ్మవారి వద్ద ఉంచిన పత్రి కొమ్మలను పంట పొలల్లో పాతిపెట్టారు. అలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం.
కొండెక్కి.. మొక్కులు చెల్లించి..
కురుపాం రూరల్: కురుపాం - భామిని మండలాల సరిహద్దుల్లో గిరిశిఖరాన వెలసిన కోటకొండ దుర్గమ్మను వందలాది మంది భక్తులు దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. వందేళ్ల కిందట ఇక్కడ దుర్గమ్మ వెలసినట్లుగా వారు చెబుతున్నారు. కాగా ఇటీవల గుడి వరకూ రోడ్డు నిర్మించడంతో అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు.