Pensions పండుగలా పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:13 PM
Festival-like Distribution of Pensions జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగా బుధవారం లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందించారు. సచివాలయ సిబ్బంది ఉదయాన్నే పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములయ్యారు.
భాగస్వాములైన అధికారులు, ప్రజాప్రతినిధులు
ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు
సాలూరు, డిసెంబరు31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగా బుధవారం లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందించారు. సచివాలయ సిబ్బంది ఉదయాన్నే పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములయ్యారు. కాగా ప్రభుత్వం ముందుగా పింఛన్ సొమ్ము అందించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. సాలూరు పట్టణంలోని 24, 26, 27 వార్డుల్లో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి నగదు అందించారు. ‘ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. గిరిజన శాఖలో పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లకు పర్మినెంట్ స్థీరీకరణ చేపట్టాం. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల కోసం రూ.1300 కోట్లు, వసతి గృహాల కోసం రూ.256 కోట్లు కేటాయించాం. గిరిజన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. సాలూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.200 కోట్లు వెచ్చి స్తున్నాం. గంజాయి నిర్మూ లనకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతూనే.. కాఫీతోటల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నాం.ప్రతి ఇంటికి అమరజీవి జలధార ద్వారా కుళాయి కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా రూ.3వేల 50 కోట్లతో ప్రాజెక్టు పనులను వేగవంతం చేశాం. ప్రజల సహకారంతో 2026లో కూటమి ప్రభు త్వం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది.’ అని మంత్రి తెలిపారు. అనంతరం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
92 శాతం పంపిణీ
గరుగుబిల్లి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): జిల్లా తొలిరోజు పింఛన్లు పంపిణీ 92 శాతం పూర్తయింది. మొత్తంగా 1,39,292 మంది లబ్ధిదారులకు గాను ప్రభుత్వం రూ. 60.02 కోట్లు విడు దల చేయగా బుధవారం 1,26,913 మందికి పింఛన్ల సొమ్ము అందించారు.